విజన్ యాక్షన్ ప్లాన్ @2047…

విజన్ యాక్షన్ ప్లాన్ @2047…

కలెక్టర్ల వీసీలో ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్

గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే విజన్ యాక్షన్ ప్లాన్ @2047 పక్కాగా అమలు కావాల్సిందేనని రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ స్పష్టం చేశారు. విజన్ యాక్షన్ ప్లాన్ @2047, జీరో పావర్టీ–P4 కార్యక్రమాల అమలుపై బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన సమగ్ర మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు.

కార్యక్రమాల అమలుకు అవసరమైన వ్యవస్థలను పటిష్టంగా వినియోగించుకోవాలని, ప్రతి స్థాయిలో సమన్వయం బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ సిబ్బందికి విధులపై పూర్తి స్పష్టత ఉండాలని, మండల పరిషత్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ వ్యవస్థాపక బృంద సభ్యులకు P4 పోర్టల్‌లో పోస్ట్-అడాప్షన్ వర్క్‌ఫ్లోపై అవగాహన కల్పించామని, వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

జిల్లాలో కార్యాచరణకు వేగం..

గుంటూరు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, జిల్లాలో విజన్ యాక్షన్ ప్లాన్ అమలుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామని తెలిపారు. జీరో పావర్టీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన యూనిట్లు, జిల్లా స్థాయి యాక్షన్ ప్లాన్ యూనిట్ల సేవలను సమన్వయంతో వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని అంశాల్లో మార్పులు, చేర్పులు అవసరమని గుర్తించి తగిన సవరణలు చేపడుతున్నామని వివరించారు.

అధికారుల సమక్షంలో సమగ్ర చర్చ..

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply