కనీస వేతనాలు చెల్లించని సంస్థలపై చర్యలు..

  • 13 మంది కార్మికులకు రూ. 1.87 లక్షలు పంపిణీ

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రైవేట్ వ్యాపార సంస్థలు తప్పనిసరిగా కార్మిక చట్టాలను, కనీస వేతనాలను అమలు చేయాలని ఉప కార్మిక కమీషనర్ కె. దినేష్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో కనీస వేతనాలు అమలు చేయని సంస్థలపై ఉప కార్మిక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో భాగంగా ఆన్‌లైన్‌లో తనిఖీకి ఎంపికైన కొన్ని దుకాణాలు, సంస్థలపై ఉప కార్మిక కమీషనర్ ఆధ్వర్యంలో ఇటీవల తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న 13 మంది కార్మికులకు కనీస వేతనాల చట్టం ప్రకారం చెల్లించాల్సిన దానికంటే తక్కువ వేతనాలు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకుని, యజమానుల నుండి తేడా వేతనంగా మొత్తం రూ. 1,87,378ను రికవరీ చేశారు.

ఈ మొత్తాన్ని సోమవారం తమ కార్యాలయంలో డిమాండ్ డ్రాఫ్ట్‌ల రూపంలో కార్మికులకు అందజేశారు. కనీస నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఉప కమిషనర్ హెచ్చరించారు.

కార్మికులకు న్యాయం జరిగేలా తమ శాఖ చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో భాగంగా ఆ 13 మందికి సంబంధిత యాజమాన్యాల ద్వారా నియామక పత్రాలు జారీ చేయించారు. అలాగే, వారికి కేంద్ర ప్రభుత్వ ఈ-శ్రమ్ నమోదు ప్రక్రియను కూడా పూర్తి చేయించారు. కనీస వేతనాల అమలు విషయంలో ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని కమిషనర్ కోరారు.

Leave a Reply