Achampeta | కెడావర్ డాగ్స్‌తో ఇద్దరి మృతదేహాలు లభ్యం

Achampeta | కెడావర్ డాగ్స్‌తో ఇద్దరి మృతదేహాలు లభ్యం
- శిథిలాల కిందే ఆరుగురు కార్మికులు
- ప్రమాద ప్రాంతాన్ని కాంక్రీట్‌తో పూర్తిగా మూసివేత
Achampeta | అచ్చంపేట, ఆంధ్రప్రభ ; బ్రహ్మగిరి కృష్ణా నది తీర ప్రాంతంలోని శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చోటు చేసుకున్న ఘోర ప్రమాదానికి నేటితో సంవత్సరం పూర్తైంది. గత ఏడాది ఫిబ్రవరి 22న సొరంగం తవ్వకం జరుగుతున్న సమయంలో పైకప్పు శిథిలాలు కూలిపడి ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీయగలిగినప్పటికీ, మిగిలిన ఆరుగురి ఆచూకీ ఏడాది గడిచినా లభించలేదు. చివరకు వారు చిక్కుకున్న ప్రమాద ప్రాంతాన్ని పూర్తిగా కాంక్రీట్‌తో మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సొరంగంలో ఘోర దుర్ఘటన..

గత ఏడాది ఫిబ్రవరి 22న ఉదయం మొదటి షిఫ్ట్‌లో జేపీ, ర్యాబిన్స్ కంపెనీలకు చెందిన 52 మంది కార్మికులు సొరంగంలోకి వెళ్లారు. సుమారు 13.950 కిలోమీటర్ల వద్ద టీబీఎం మిషన్ డ్రిల్లింగ్ ప్రారంభించిన కొద్ది సేపటికే, పైకప్పుకు అమర్చిన సిమెంట్ సెగ్మెంట్ బ్లాకులు, శిథిలాలు ఒక్కసారిగా కూలిపడ్డాయి. దీంతో అక్కడ పని చేస్తున్న ఎనిమిది మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రమాద తీవ్రతకు 120 మీటర్ల పొడవున్న టీబీఎం మిషన్ రెండు భాగాలుగా విరిగిపోయింది. లిఫ్టింగ్ క్రేన్, డీవాటరింగ్ పైపులు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వెంటిలేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాయి. 12వ కిలోమీటర్ వరకు బురద చేరి లోకో ట్రైన్ ట్రాక్ పూర్తిగా మట్టిలో కూరుకుపోయింది. తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య రెస్క్యూ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి.
65 రోజుల అన్వేషణ… ఫలితం శూన్యం..
శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశీ–విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. రోబోలు, జియోఫిజికల్ పరికరాలు, స్పెషల్ డ్రిల్లింగ్ పద్ధతులతో అన్వేషణ చేపట్టినా ఆరుగురి ఆచూకీ లభించలేదు.
ఇద్దరి మృతదేహాలను గుర్తించిన కెడావర్ డాగ్స్..

మార్చి 9న టీబీఎం మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్, మార్చి 25న ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాలను కేరళకు చెందిన కెడావర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల నుంచి వెలికితీశారు. అయితే డీ1 ప్రాంతం నుంచి ముందుకు టీబీఎం చిక్కుకున్న ఏరియాను అత్యంత ప్రమాదకరంగా అధికారులు పరిగణించారు.
‘ షేర్ జోన్’లో తవ్వకాలు అసాధ్యం..
శిథిలాలతో నిండిన సుమారు 43 మీటర్ల ‘షేర్ జోన్’ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే తప్ప ఆరుగురిని గుర్తించడం సాధ్యం కాదని సాంకేతిక నిపుణులు సూచించారు. అయితే ఆ ప్రాంతంలో మళ్లీ తవ్వకాలు చేస్తే మరింత ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. 12 మంది సభ్యుల బృందం అధ్యయనం అనంతరం, టీబీఎం పద్ధతి బదులు డీబీఎం విధానంలో సొరంగం పనులు కొనసాగించాలని నిర్ణయించారు.
డీ1, డీ2 ప్రాంతాల మూసివేత..

ప్రమాదకరంగా గుర్తించిన డీ1, డీ2 ప్రాంతాల్లో సుమారు 50 మీటర్ల మేర సొరంగాన్ని పూర్తిగా కాంక్రీట్ బెడ్ వేసి మూసివేస్తున్నారు. మిగిలిన సుమారు 10 కిలోమీటర్ల సొరంగాన్ని డీబీఎం పద్ధతిలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.
అక్కడే ఆరుగురు…
ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురు కార్మికుల మృతదేహాలను ఇక బయటకు తీసే అవకాశం లేదని అధికారులు తేల్చారు. అత్యంత ప్రమాదకర ప్రాంతంలో వారు పూర్తిగా మట్టిలో కూరుకుపోవడంతో ఆ ప్రాంతాన్ని మూసివేశారు. ప్రమాదం జరిగిన కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించింది. అయినప్పటికీ, వారి మృతదేహాలు అక్కడే మిగిలిపోవడం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.
ఏడాది గడిచినా తీరని వేదన..
ఎస్ఎల్బీసీ ప్రమాదం తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఘటనగా నిలిచింది. ఏడాది గడిచినా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించకపోవడం, ప్రమాద ప్రాంతాన్ని మూసివేయాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ యంత్రాంగానికే కాక ప్రజలకు కూడా తీరని వేదనగా మిగిలింది. సొరంగం పనులు తిరిగి ప్రారంభమైనప్పటికీ, ఆ ఆరుగురు కార్మికుల కుటుంబాల కన్నీళ్లకు మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకలేదు.
