సీసీ కెమెరాల ఫుటేజ్ లతో వివరాలు వెల్లడించిన పోలీసులు
హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ప్రవీణ్ ఆరుగురితో మాట్లాడారని వెల్లడి
రెండు చోట్ల వైన్స్ దగ్గర ఆగి మద్యం కొనుగోలు చేశారని వివరణ
వైన్స్ వద్ద, పెట్రోల్ బంక్ వద్ద యూపీఐ ద్వారా చెల్లింపులు చేశారన్న ఐజీ
ఏలూరు – తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి ప్రమాదవశాత్తు జరిగిందేనని పోలీసులు వెల్లడించారు.. కంకర వల్ల బైక్ స్లిప్ అయి పడిపోవడమే పాస్టర్ మరణానికి కారణమని, మరే వాహనం ఆయన బైక్ ను ఢీ కొట్టలేదని స్పష్టంగా తేలిందన్నారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, ప్రవీణ్ మరణించిన రోజు ఏం జరిగింది, హైదరాబాద్ నుంచి పాస్టర్ ఎప్పుడు బయలుదేరారు, మార్గమధ్యలో ఎక్కడెక్కడ ఆగారు.. అనే వివరాలను సీసీటీవీ ఫుటేజీలతో సహా వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతం వరకు జరిగిన సంఘటనలను, పాస్టర్ ప్రవీణ్ మాట్లాడిన వారిని విచారించి ఆ రోజు ఏంజరిగిందనేది తెలుసుకున్నామని ఆయన తెలిపారు. మార్గమధ్యలో వివిధ పాయింట్ల వద్ద సీసీటీవీ ఫుటేజీలను ప్రదర్శిస్తూ పాస్టర్ ప్రవీణ్ మూడుసార్లు స్వల్ప ప్రమాదానికి గురయ్యారని తెలిపారు.
పాస్టర్ ప్రయాణించిన ద్విచక్ర వాహనం దెబ్బతిందని, హెడ్ లైట్ పగిలిపోయిన దృశ్యాలను చూపించారు. పెట్రోల్ బంక్ లలో, రెండుచోట్ల వైన్స్ షాప్ లలో పాస్టర్ యూపీఐ ద్వారా పేమెంట్లు చేశారని తెలిపారు. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ ఇండికేటర్ వేసుకుని పాస్టర్ ప్రయాణించారని చెప్పారు. ప్రమాద స్థలానికి చేరుకున్నపుడు పాస్టర్ ప్రవీణ్ 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోందని, కంకర రోడ్డు కారణంగా బైక్ స్లిప్ అయి రోడ్డుపక్కన గుంతలో పడిపోయారని వివరించారు. గుంత అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల బైక్ ఎగిరి పాస్టర్ పై పడిందని పోలీసులు వివరించారు.
పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో అన్ని విధాలుగా, క్షుణ్ణంగా పరిశోధించామని ఐజీ అశోక్ కుమార్ చెప్పారు. పాస్టర్ బయలుదేరిన సమయం నుంచి ప్రమాద స్థలం వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే వివరాలు పరిశోధించి తెలుసుకున్నామని వివరించారు. పోస్ట్ మార్టం రిపోర్టులోనూ పాస్టర్ ప్రవీణ్ ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నారని వెల్లడైందన్నారు.
సీసీటీవీ ఫుటేజీలను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపి రిపోర్టు తెప్పించినట్లు ఐజీ వివరించారు. కాగా, పాస్టర్ ప్రవీణ్ మరణంపై తప్పుడు ప్రచారం చేసిన పలువురికి నోటీసులు పంపించామని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు.