Accident | పెళ్లి బృందం వాహనం బోల్తా – 30 మందికి గాయాలు

ఆదిలాబాద్ జిల్లాలో పెండ్లింట విషాదం నెలకొంది. పెండ్లి కొడుకుని వధువు ఇంటికి తీసుకొస్తుండగా జరిగిన ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు.

వారిలో నలుగురి పిరస్థితి విషమంగా ఉన్నది. ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం నేరడిగొండ (జీ)లో ఈ ఘటన చోటుచేసుకున్నది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరడిగొండ(జీ)కి చెందిన యువతికి జైనూర్ మండలం బూసిమెట్ట గ్రామ యువకుడితో పెండ్లి నిశ్చయమైంది. ఈ నెల 22న (గురువారం) వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం ఉదయం వరుడిని వధువు ఇంటికి తీసుకొచ్చేందుకు నేరడిగొండ(జి)కి చెందిన 30 మంది మినీ వ్యాన్‌లో బయలుదేరారు. పెండ్లి కొడుకుని తిసుకుని రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో రాత్రి 11.15 గంటల సమయంలో వ్యానును డ్రైవర్‌ అతివేగంగా నడపడంతో గ్రామానికి కిలోమీటరు దూరంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.

దీంతో అందులో ఉన్న 30 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిలో నేరడిగొండ(జీ)కి చెందిన కుమ్ర ఈశ్వర్, గంగా ప్రసాద్ ఉన్నారు. క్షతగాత్రులను ఐదు 108 వాహనాల్లో ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానకు తరలించారు. స్వల్ప గాయాలతో వరుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

Leave a Reply