Accident | మరో బస్సు ప్రమాదం..

Accident | మరో బస్సు ప్రమాదం
- లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు..
- తప్పిన పెను ప్రమాదం..
- 3 తీవ్ర గాయాలు 11 మందికి స్వల్ప గాయాలు…
- స్పందించిన హైవే మొబైల్ టీం..
- మెరుగైన చికిత్స కు విజయవాడ తరలింపు..
Accident, ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడ, హైదరాబాదు (Hyderabad) హైవే మరో ప్రైవేటు బస్సు భీభత్సం సృష్టించింది. లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మరో లారీని ఢీకొనడంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద హైదరాబాదు నుండి విజయవాడ వస్తున్న కావేరీ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేటు బస్సు లారీని అతి వేగంగా ఓవర్ టెక్ చేస్తూ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో పదకొండు మందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉండగా, సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ప్రయాణికులు అందరూ షాక్ కు గురయ్యారు.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన హైవే మొబైల్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స అనంతరం కొంతమందికి మెరుగైన వైద్య చికిత్సల కోసం విజయవాడ తరలించారు. కేసు నమోదు చేసిన నందిగామ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

