మిర్యాలగూడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

నల్గొండ జిల్లా, మిర్యాలగూడ : మిర్యాలగూడ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పలు ఫైళ్లు, రికార్డులు, డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించారు. కార్యాలయంలో ఇటీవల రిజిస్ట్రేషన్ చేసిన 19 డాక్యుమెంట్లను ఏసీబీ అధికారలు స్వాధీనం చేసుకున్నారు.

సోదాల సమయంలో కార్యాలయంలో అనధికారికంగా ఒక మహిళ పనిచేస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆమె వద్ద నుంచి రూ.63 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు అవినీతి సొమ్మై ఉండొచ్చనే అనుమానాలతో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఇక‌, కార్యాలయంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వాటిని పథకం ప్రకారమే ఉద్దేశపూర్వకంగా నిలిపివేసినట్లు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. భూముల క్రయ–విక్రయాల్లో జరిగిన లావాదేవీలపై సబ్‌రిజిస్ట్రార్‌ బలరాం యాదవ్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంతో నిర్వహించిన ఈ సోదాలు బలరాం యాదవ్‌కు చెందిన హైదరాబాద్‌లోని సొంత ఇంటిలో కూడా కొనసాగుతున్నాయి.

వైరా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం హల్‌చల్…

మ‌రోవైపు ఖమ్మం జిల్లా వైరా సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గత కొంతకాలంగా కొనసాగుతున్న అవినీతి ఆరోపణలు, పలు ఫిర్యాదులు, అలాగే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఏసీబీ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఖమ్మం–భద్రాద్రి కొత్తగూడెం ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో విస్తృత దర్యాప్తు కొనసాగుతోంది. మొదటగా డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుంచే తనిఖీలు ప్రారంభించగా, వారి మొబైల్స్, నగదు, ఫోన్‌పే లావాదేవీల వివరాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. దాదాపు పది మంది డాక్యుమెంట్ రైటర్లతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి సంబంధించిన మొబైల్ ఫోన్లు పరిశీలన నిమిత్తం తాత్కాలికంగా స్వాధీనం చేశారు.

డాక్యుమెంట్ రైటర్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు రామారావు వద్ద రూ.2.5 లక్షల నగదు లభించగా, ఆ డబ్బుకు సంబంధించిన వివరాలు ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. అలాగే సబ్‌రిజిస్ట్రార్ కిరణ్‌ను డీఎస్పీ రమేష్ పలు అంశాలపై ప్రశ్నించారు.

గతంలో “ఇండో–కతర్” పేరుతో ఒకే రోజు 90కి పైగా రిజిస్ట్రేషన్లు జరిపి భారీ వివాదాలకు కారణమైన కేసును కూడా ఏసీబీ పునర్విమర్శిస్తోంది. అప్పటి సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్‌కు గురైనప్పటికీ, కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఆగకపోవడంతో ఈ సారి మరింత విస్తృతంగా తనిఖీలు జరిగాయి. ప్రతి డాక్యుమెంట్ ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Leave a Reply