World cup| మరీ.. ఇన్ని జీరోలా..?

World cup| మరీ.. ఇన్ని జీరోలా..?
- పూర్ ఫామ్‌లో అభిషేక్ శర్మ
- టీ20 ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలం
- వరుసగా మూడు మ్యాచుల్లో డకౌట్
- నెంబర్‌వన్ బ్యాటర్‌పై ఫ్యాన్స్ ఫైర్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ :టీమిండియా టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మ పేరు వింటేనే ప్రత్యర్థులకు దడ పుడుతుంది. ఈ విధ్వంసక వీరుడు క్రీజ్‌లోకి అడుగుపెడితే పూనకం వచ్చినట్లు ఫోర్లు, సిక్సులతో చెలరేగిపోతాడు. ఈ టీ20 నెంబర్‌వన్ బ్యాటర్‌కు ఎలా బౌలింగ్ చేయాలా..? ఎలాంటి బంతులు వేయాలో తెలియక బౌలర్లు తలలు పట్టుకుంటారు. అందరినీ షేక్ చేసే అభిషేక్ శర్మ ఇటీవల అతనే షేక్ అవుతున్నాడు. టీ20 ప్రపంచకప్ 2026లో ఆడిన మూడు మ్యాచుల్లో డకౌట్లతో డగౌట్‌కు చేరుతున్నాడు. ఒక్క పరుగు కూడా చేయకుండా మొదటి ఓవర్లోనే వెనుదిరుగుతున్నాడు. చెత్త ఫామ్‌తో సతమతమవుతున్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో (యూఎస్ఏ, పాకిస్తాన్) డకౌట్లు కాగా.. నిన్న (ఫిబ్రవరి 18) పసికూన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఖాతా తెరవలేక హ్యాట్రిక్ డకౌట్ల అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. వరుసగా మూడు మ్యాచుల్లో డకౌట్ కావడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాక చివరి 7 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లో ఇది ఐదో డకౌట్ కావడం మరింత దారుణం. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్‌లో జెర్సీ మార్పు కూడా సత్ఫలితాన్ని ఇవ్వలేదు. అభిషేక్ తన రెగ్యులర్ జెర్సీ కాకుండా సిరాజ్ వేసుకునే 73వ నంబర్ జెర్సీ ధరించి బరిలోకి దిగినా పరుగుల ఖాతాను ఓపెన్ చేయలేదు. తాజా డకౌట్ తర్వాత అభిషేక్.. సంజూ శాంసన్ పేరిట ఉన్న ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో టీ20ల్లో అత్యధిక డకౌట్లైన భారత బ్యాటర్‌గా సంజూ శాంసన్ (2024) సరసన చేరాడు. సంజూ, అభిషేక్ ఇప్పుడు తలో ఐదు డకౌట్లతో కొనసాగుతున్నారు.

