ABC Center | పున‌రావృతం కాకుండా…

ABC Center | పున‌రావృతం కాకుండా…

  • ఏబీసీ ఆపరేషకు ఏజెన్సీ సిద్ధం
    – గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్

ABC Center | గుంటూరు, ఆంధ్రప్రభ : నల్లచెరువు ప్రాంతంలో ఫణీంద్రరెడ్డి అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ తక్షణమే స్పందించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమిషనర్ సూచనల మేరకు సిటీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ (CMOH) డాక్టర్ శాంతికళ, మెడికల్ హెల్త్ ఆఫీసర్ (MHO) డాక్టర్ లక్ష్మీనారాయణలను వెంటనే ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జిజిహెచ్)కు వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని, కుటుంబ సభ్యులను పరామర్శించాలని ఆదేశించారు.

జిజిహెచ్ సూపరిండెంట్‌తో స్వయంగా మాట్లాడిన కమిషనర్, బాలుడికి అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని స్పష్టం చేశారు. అదేవిధంగా నల్లచెరువు ప్రాంతంలో ఉన్న వీధి కుక్కలకు యాంటి ర్యాబీస్ టీకాలు వేయాలని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌కు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలో వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం పొన్నూరు రోడ్డులో నిర్మిస్తున్న ఏబీసీ (Animal Birth Control) సెంటర్ పనులు వేగంగా సాగుతున్నాయని కమిషనర్ తెలిపారు. ఈ నెలాఖరులోగా ఏబీసీ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

Leave a Reply