హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : యుగారంభం నుంచి యుగాంతం వరకూ అనుకూల దశలో నడిపించే అభయ గణపతి పావన స్పర్శ మనకు ఏకైక లక్ష్యం కావాలని ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పేర్కొన్నారు. హైదరాబాద్ రాయదుర్గం సమీపంలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న డి.వి.ఆర్.డబ్ల్యూ అసోసియేషన్ వారి డ్రీమ్ గ్రౌండ్స్ లో ప్రత్యేకంగా కృష్ణశిలతో పరమాద్భుతంగా నిర్మించిన శ్రీ అభయగణపతి దేవాలయం ప్రారంభోత్సవ వేడుకను వేదవేదుల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి, అర్చనలు చేసి ఆయన లాంఛనప్రాయంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా పురాణపండ మాట్లాడుతూ… ప్రాణ సంచార సమయంలోనూ, ముగింపులోనూ వినాయకుని అనుగ్రహమే మనకు ఆధారమని… మహా గణపతి ఉపాసన పంచ మహా పాతకాల్ని భస్మం చేస్తుందని… ఈ ఆనందోత్సవ విగ్రహ వేడుకలో పాల్గొనడం ఎంతెంతో సంతోషం కలిగిస్తోందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వందలాది మంది భక్తుల సమక్షంలో అపూర్వంగా జరిగిన గణేశ హోమం, ప్రత్యేక పూజల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎమ్. రమేష్ రెడ్డి మాట్లాడుతూ… వినాయకుని ఆలయ దర్శనం, వినాయకుని ప్రార్ధన జరిగే చోట ధైర్యం, జయం తప్ప నైరాశ్యాలు, విషాదాలు, విచారాలు ఉండవని పేర్కొన్నారు.
ఆపదలను దూరం చేసే అద్భుతమే గణపతి మంత్రం సాధన అని రమేష్ రెడ్డి చెప్పారు. ఈసందర్భంలో కర్ణాటక బళ్లారిలో ఇటీవల సుమారు ఇరవై ఐదుకోట్ల భారీ వ్యయంతో వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి అద్భుతంగా నిర్మించిన శ్రీ అమృతేశ్వరాయం సమర్పణలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచించిన సహస్ర అపురూప గ్రంధాన్ని రమేష్ రెడ్డి ఆవిష్కరించి శ్రీనివాస్ నిర్విరామ పవిత్ర కృషిని అభినందించారు.
ఈ శ్రీకార్యంలో శ్రీ అభయగణపతి ఆలయ కమిటీ సభ్యులు జస్టిస్ డి.వి.ఆర్.వర్మ, భాస్కర్ రెడ్డి, రాచకొండ రమేష్, దాట్ల రవివర్మ, సంజయ్ కమటం, గొర్తి రవి ప్రసాద్, శ్రీనివాస్ రామ్ సాగర్, అమిత్ శర్మ, సందీప్ కమటం, శ్రీధర్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత శృంగేరికి చెందిన మహా పండితులు ఎన్.ఎస్.శర్మ బృందం సుమారు మూడుగంటల పాటు ఆలయ ప్రతిష్టకు సంబంధించిన మంత్ర భాగాలతో సమస్త వైదిక కార్య కలాపాల్ని సంప్రదాయంగా నిర్వహించడం అందరినీ విశేషంగా ఆకర్షించింది. కృష్ణ శిలతో ఈ అభయ గణపతి ఆలయాన్ని నిర్మించడంలో శిల్పనైపుణ్యాన్ని ప్రదర్శించిన జయలక్ష్మీ ఆచార్యులను ఐ జి. రమేష్ రెడ్డి నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.


