ఆదోని మాజీ సబ్ రిజిస్ట్రార్‌కు షాక్

ఆదోని మాజీ సబ్ రిజిస్ట్రార్‌కు షాక్

  • మూడు ఏళ్లు ఇంక్రిమెంట్ కోత
  • రూ. 20.26 లక్షల స్టాంపు సుంకం రికవరీ
  • లోకాయుక్త ఆదేశాల మేరకు చర్యలు
  • ఫిర్యాదీకి లోకాయుక్త అభినందనలు

కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : ఆదోని పరిధిలో రూ.20.26 లక్షల స్టాంపుల సుంకం నష్టం జరిగిన అంశంలో మాజీ సబ్ రిజిస్ట్రార్‌(Ex Sub Registrar)పై లోకాయుక్త సంస్థ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఆదోనికి చెందిన వై. రామకృష్ణ( Y. Ramakrishna) ఫిర్యాదు (ఫిర్యాదు నెం. 246/2024/బి1) ఆధారంగా ఉప-లోకాయుక్త పీ. రజని విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫిర్యాదు మేరకు అప్పటి ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆర్. రాజశేఖర్, డాక్యుమెంట్ నెం.5352/2023ను తక్కువ స్టాంపు డ్యూటీతో రిజిస్ట్రేషన్(Registration) చేయడంతో రాష్ట్ర ఖజానాకు రూ.20,26,200లు నష్టం వాటిల్లింది. ఇది భారతీయ స్టాంపుల(Stamps) చట్టంలోని సెక్షన్ 27 నిబంధనలకు విరుద్ధం. ఈ విషయంపై లోకాయుక్త కార్యాలయం జారీ చేసిన నోటీసుల మేరకు, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్(Inspector General of Registration) విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు.

అందులో ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు నిజం అని తేలింది. విచారణ అనంతరం ఆ స్టాంపు డ్యూటీ మొత్తాన్ని సంబంధిత వ్యక్తుల నుండి వసూలు చేయడమేకాక, రాజశేఖర్‌(Rajasekhar)పై 1991 ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్(Civil Services) (సీసీఎ) నియమావళి ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఆయనకు 3 సంవత్సరాల పాటు ఇంక్రిమెంట్‌ను (పునరావృత ప్రభావం లేకుండా) నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ చర్యలతోపాటు, ఈ అక్రమాన్నివెలికితీసి లోకాయుక్త దృష్టికి తీసుకురావడంలో వై. రామకృష్ణ చూపిన చొరవను ఉప-లోకాయుక్త ప్రశంసించారు. అధికారుల తక్షణ స్పందన, దిద్దుబాటు చర్యలను పరిగణనలోకి తీసుకొని ఫిర్యాదును మూసివేశారు. ఈ ఘటన, ప్రజాధికార పరిరక్షణలో భాగంగా లోకాయుక్త(Lokayukta) వ్యవస్థ ప్రభావమును చూపింది.

Leave a Reply