- నివాసం ఉంటున్న ఇంటిని కూల్చారు..
- రోడ్డుపై పెట్రోల్ డబ్బా తో రాస్తారోకో
మోత్కూరు, (ఆంధ్రప్రభ) : యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కాశవారి గూడెం గ్రామానికి చెందిన మహమ్మద్ పక్కీర్ అహ్మద్ కుటుంబం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
సుమారు 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమిలోని సర్వే నెంబర్ 402లో 242 గజాల స్థలంలో గుడిసె వేసుకొని వారు నివాసం ఉంటున్నారు. ఆ తర్వాత దశలవారీగా ఇంటి నిర్మాణం చేపట్టుకున్నట్టు బాధితుడు తెలిపాడు. అయితే, అడ్డగూడూరు మండలం కోటమర్తికి చెందిన బెల్లి నగేష్ అనే వ్యక్తి 2020లో అదే సర్వే నెంబర్‌లోని భూమి తనదేనని, ప్రభుత్వం క్రీడాకారుల కోటాలో తనకు కేటాయించిందని చెబుతూ ఆ స్థలం ఖాళీ చేయాలని తహసీల్దార్‌ను సంప్రదించాడు.
ఈ నేపథ్యంలో సోమవారం తహసీల్దార్ అనుమతులతో మున్సిపాలిటీ అధికారులు జేసీబీ సహాయంతో పక్కీర్ అహ్మద్ ఇంటిని కూల్చివేశారు. నివాసం లేకుండా రోడ్డుపైకి చేరిన కుటుంబం పెట్రోల్ డబ్బా పట్టుకుని రాస్తారోకో నిర్వహించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆరుబయట మాట్లాడించి, రాస్తారోకోను విరమింపజేశారు.
బాధితులు మాట్లాడుతూ…. బెల్లి నగేష్‌కు క్రీడాకారుల కోటాలో మోత్కూరు కాశవారి గూడెంలో కాకుండా, భువనగిరి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోనే ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇచ్చింది. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ప్రభుత్వం ఎలా కేటాయిస్తుందో విచారించాలని డిమాండ్ చేశారు.
అతనికి భువనగిరిలో ఇల్లు ఇచ్చిన నేపథ్యంలో, కాశవారి గూడెం స్థలాన్ని తమకు కేటాయించాలని బాధిత కుటుంబం కోరింది

