ఆర్చ‌రీ చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయం..

భారత ఆర్చరీ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. తొలిసారిగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL) నిర్వహించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ లీగ్ లో దేశంలోని అగ్రశ్రేణి క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాల్లో ఉన్న దీపికా కుమారి, ధీరజ్ బొమ్మదేవర, జ్యోతి సురేఖ వేన్నం, అభిషేక్ వర్మ వంటి ఆటగాళ్లు ఈ లీగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలు అక్టోబర్‌లో ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా 11 రోజులపాటు జరగనున్నాయి.

ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAI) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ లీగ్‌కు వరల్డ్ ఆర్చరీతో పాటు ఆసియా ఆర్చరీ ఫెడరేషన్ నుంచి కూడా అధికారిక మద్దతు లభించింది. ఇక‌ ఆరు జట్లతో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌ను భారత విలువిద్య చరిత్రలో తొలి ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌గా పరిగణిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఫ్లడ్‌లైట్స్ కింద పోటీలు జరగనున్నాయి. రికర్వ్ విభాగంలో 70 మీటర్ల దూరం, కాంపౌండ్ విభాగంలో 50 మీటర్ల దూరంలో విలువిద్య పోటీలు సాగనున్నాయి.

ప్రతి జట్టులో ఎనిమిది మంది ఆటగాళ్లు ఉండనున్నారు. వీరిలో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు తప్పనిసరి. అందులో గరిష్టంగా ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఆడే అవకాశం ఉంది. అయితే వారిలో కనీసం ఒకరు మాత్రం ప్రధాన జట్టులో ఉండాల్సిందే. ఈ సీజన్‌లో ఆటగాళ్ల ఎంపికకు వేలం విధానం కాకుండా డ్రాఫ్ట్ సిస్టమ్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. భారత ఆటగాళ్ల ఎంపికను ప్రపంచ ర్యాంకింగ్స్.. అలాగే ఇటీవల జరిగిన AAI సెలెక్షన్ ట్రయల్స్ ఆధారంగానే పూర్తి చేశారు.

రికర్వ్ విభాగంలో ప్రపంచ నం.3 ర్యాంక్‌లో ఉన్న దీపికా కుమారి, నం.14 స్థానంలో ఉన్న ధీరజ్ బొమ్మదేవర ప్రధాన ఆకర్షణలుగా నిలవ‌నున్నారు. వీరితో పాటు తరుణ్‌దీప్ రాయ్, అతను దాస్, అంకితా భక్త్, భజన్ కౌర్ వంటి ప్రతిభావంతులూ పోటీలో పాల్గొంటున్నారు. పురుషుల విభాగంలో నీరజ్ చౌహాన్, రాహుల్, రోహిత్ కుమార్, మృణాల్ చౌహాన్, సచిన్ గుప్తా, కృష్ణ్ కుమార్ బరిలోకి దిగుతున్నారు.

కాంపౌండ్ విభాగంలో ప్రపంచ రికార్డు హోల్డర్, ప్రపంచ నం.3 ర్యాంక్‌లో ఉన్న జ్యోతి సురేఖ వేన్నం, నం.9 స్థానంలో ఉన్న రిషభ్ యాదవ్ ప్రధానంగా ముందంజలో ఉన్నారు. వీరితో పాటు నం.10 ర్యాంక్‌లో ఉన్న అభిషేక్ వర్మ, నం.11 స్థానంలో ప్రథమేష్ ఫ్యూజ్, నం.16 స్థానంలో ప్రియాంశ్, నం.17 స్థానంలో పర్నీత్ కౌర్ పాల్గొననున్నారు.

అదనంగా, అమన్ సైనీ, ఓజాస్ దేవోతలే, సాహిల్ రాజేష్ జాదవ్, చిట్టిబొమ్మ జిగ్నాస్, ప్రితికా ప్రదీప్, అవ్నీత్ కౌర్, మధుర ధామన్‌గావ్‌కర్ కూడా పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించబోతున్నారు.

ఈ సందర్భంగా ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అర్జున్ మాట్లాడుతూ – “మొదటి సీజన్ నుంచే భారత అగ్రశ్రేణి విలువిద్య క్రీడాకారులు పాల్గొనడం మాకు గర్వకారణం. వారి సమక్షంలో లీగ్ ప్రతిష్టను పెంచడమే కాకుండా, అభిమానులకు కూడా ఒక విశిష్ట అనుభూతిని అందిస్తుంది,” అని తెలిపారు.

Leave a Reply