ప్రకాశం బ్యారేజీకి తప్పిన ముప్పు…

ప్రకాశం బ్యారేజీకి తప్పిన ముప్పు…
- వరద నీటిలో కొట్టుకు వచ్చిన బోటు..
- గుర్తించిన డ్రోన్లు…
- స్పందించిన అధికార ఘనం..
- సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన వైనం..
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ప్రకాశం బ్యారేజ్ కి పెను ప్రమాదం తప్పింది. వరద నీటితో పాటు బ్యారేజ్ వైపు వేగంగా దూసుకువస్తున్న ఓ బోటును డ్రోన్లు గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించిన విపత్తుల నిర్వహణ బృందం ఆ బోటును హుటాహుటిన సురక్షితంగా ఓడ్డుకు చేర్చారు. దీంతో పెద్ద ప్రమాదాన్ని తప్పింది.
సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టి మరోసారి ఫలించింది. టెక్నాలజీ సహాయంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. విపత్తుల నిర్వహణలో డ్రోన్ల వినియోగం ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.
కృష్ణా నదిలో ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకుని వస్తున్న బోటును డ్రోన్లు గుర్తించి, వెంటనే విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్…. ఎస్‌డిఆర్‌ఎఫ్, డ్రోన్ బృందాలతో సమన్వయం చేస్తూ స్వయంగా పర్యవేక్షించారు. తుమ్మలపాలెం వద్ద బోటును గుర్తించిన అధికారులు, ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది, గజఈతగాళ్ల సహకారంతో దానిని ఒడ్డుకు చేర్చారు.
కృష్ణా నది వరద ఉధృతిలో ఆ బోటు ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్దకు చేరి ఉంటే భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరం బుడమేరు వరదల్లో బ్యారేజ్ గేట్లకు బోటు చిక్కుకున్న ఘటనను గుర్తుచేసుకున్నారు. అప్పుడు ఆ బోటును తీయడానికి ఎనిమిది రోజులు పట్టిందని, అప్పట్లో అధికార యంత్రాంగం పడిన శ్రమ గుర్తు చేసుకున్నారు.

