Alampur : రెండు బస్సులను ఢీ కొన్న లారీ – 40 మందికి గాయాలు
ఆలంపూర్ – జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై నేటి తెల్లవారుజామున లారీ, రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. బండల లోడుతో వెళ్తున్న లారీ యూ టర్న్ తీసుకుంటుండగా.. హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సు దాన్ని ఢీకొట్టింది. అనంతరం దాని వెనుక వస్తున్న హైదరాబాద్-తిరుపతి కావేరి ట్రావెల్స్ బస్సు సీజీఆర్ బస్సును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కావేరి ట్రావెల్స్ బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులకు గాయాలు కాగా.. డ్రైవర్ కాలు విరిగింది. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీజీఆర్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులకు సైతం స్వల్పగాయాలు అయ్యాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పోలీసులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.