A Konduru | ప్రక్షాళన దిశగా కస్తూరిబా గాంధీ విద్యాలయం – ప్రిన్సిపల్ ఏఎన్ఎం ల పై సస్పెన్షన్ వేటు

( ఏ కొండూరు(ఎన్టీఆర్ జిల్లా), ఆంధ్రప్రభ )ఆరోపణలు, ప్రత్యారోపణలతో నిత్యం ఏదో ఒక వివాదంతో విద్యాశాఖ ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారిన, ఎ.కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలోని విద్యాలయంలో ఇటీవల ప్రిన్సిపాల్, బోధనా సిబ్బంది జిల్లా కలెక్టర్ కు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు వ్రాతపూర్వక ఫిర్యాదులు చేసుకోగా తిరువూరు ఆర్డీవో కె.మాధురి ఎ.కొండూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పూర్తిస్థాయిలో విచారణ జరిపారు.

ఈ నేపథ్యంలో విద్యాలయం బాలికలు ఆర్డీవోకు తమకు మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని ఫిర్యాదు చేయడం, అలానే నాడు నేడు నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆర్డీవో విచారణలో ఆరోపణలు రావడంతో ఆర్డీవో జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన నివేదికను పురస్కరించుకొని కలెక్టర్ ప్రిన్సిపాల్, ఏఎన్ఎం పై సస్పెన్షన్ వేటు వేశారు.

ఈ విద్యాలయం శంకుస్థాపన చేసిన నాటి నుండి ఇక్కడ అనేక వివాదాలు చోటుచేసుకుని, అనేకమార్లు, రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు బాలికల విద్యాలయాన్ని తనిఖీలు నిర్వహించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అధికారులు విద్యాలయాన్ని తనిఖీ నిర్వహించిన సమయాల్లో తమ తీరు మార్చుకోవాలని, బాలికలకు నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య, వైద్య సౌకర్యాలు అందించాలని పలుమార్లు హెచ్చరికలు చేసినప్పటికీ విద్యాలయంలో వివాదాలు సద్దుమణక పోగా వివాదాలు నానాటికి ఉదృతం కావడంతో జిల్లా అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని విద్యాలయం లో పూర్తిస్థాయిలో విచారణ జరిపి సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది.

ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు కొద్ది రోజుల్లోనే పబ్లిక్ పరీక్షలు ఉండటంతో పాఠశాలలో నెలకొన్న ఈ వివాదాల వల్ల తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా విద్యాలయంలో బోధనా సిబ్బంది, బాలికల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందించి పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఎ.కొండూరు అడ్డరోడ్డు సమీపాన ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ ను, ఎ.కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ గా జిల్లా కలెక్టర్ బాధ్యతలు అప్పగించినట్లు మండల విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *