అమ్మతనానికి అవమానం!
తన కడుపును చీల్చుకు వచ్చిన కన్నబిడ్డల కోసం తన ప్రాణాలనైనా త్యాగం చేయడానికి సిద్ధపడే ప్రత్యక్ష దైవం…అమ్మ. కన్నపేగు బంధం కోసం అంతులేని ప్రేమను పంచేది అమ్మ (mother). అందుకే లోకంలో అమ్మప్రేమకు సాటిలేదు, రాదని అంటుంటాం. అయితే….ఆ అమ్మప్రేమ మసకబారుతోంది… అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారనో..ఆర్థిక బాధల (Financial distress) అసహనంతోనో… అనురాగాన్ని చంపుకుని… ఆపై కన్నబిడ్డలను కడతేరుస్తున్నారు. ఇది అక్కడక్కడా జరుగుతోన్నా…అమ్మతనానికే మాయని మచ్చగా మిగిలిపోతున్నాయి. మానవత్వమే నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది.
అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని
మూడేళ్ల కన్నకూతుర్ని చంపిన తల్లి.
వివరాల్లోకి వెళితే….
ఇంకా మూడేళ్లు కూడా నిండని చిన్నారి, తల్లి కొంగు పట్టుకొని ముద్దు ముద్దు మాటలతో ముద్దులొలికే చేష్టలతో తిరుగుతుంటే మురిసిపోవాల్సిన ఆ చేతులు…. ఆ పసిపాప పీక పిసికి ప్రాణాలు తీయడానికి ఆ తల్లికి మనసేలా వచ్చిందో? ఇది కిరాతకమా… మృగత్వమా.? ఏమనాలి…? పిల్లలు లేక ఫెర్టిలిటీ ఆసుపత్రుల (Fertility hospitals) చుట్టూ తిరుగుతూ లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న దంపతులెందరో ఉన్నారు. పిల్లలను కొనుక్కొని అయినా పెంచుకోవాలని, ప్రేమ పంచాలని ఆరాట పడుతున్న వారూ ఎందరో.. పిల్లలను ఇస్తే పెంచుకుంటామని అంటూ అనాథ శరణాలయాల చుట్టూ తిరుగుతున్న వారున్నారు. అమ్మప్రేమ పంచాలని ఆరాటపడే అమ్మప్రేమ అందించాలని ఆరాటపడే ఆడవారున్న మన సమాజంలో… ఇలాంటి మానవ మృగాలు కూడా ఉన్నాయని ఆ పసి పిల్లలకు తెలియదు.
మెదక్ జిల్లా (Medak District) శివ్వంపేట మండలం శభాష్ పల్లిలో జరిగిన ఓ కిరాతక సంఘటనే ఒక ఉదాహరణ
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం (Shivampet Mandal) శభాష్‌పల్లిలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డువస్తోందని మూడేళ్ల కూతురిని చంపి పూడ్చిపెట్టింది ఓ తల్లి. చిన్నారి తల్లి మమత (Mamata), ప్రియుడు ఫయాజ్ (Fayaz) ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. అనంతరం వీరిద్దరూ గుంటూరుకు పారిపోయారు. మే 27వ తేదీ నుంచి తన కూతురు, భార్య కనిపించడం లేదంటూ మమత భర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మమతను ఆమె ప్రియుడు ఫయాజ్‌ను గుంటూరులో పట్టుకున్నారు. మమతను విచారించగా కూతురిని చంపినట్లు ఒప్పుకుంది. ప్రియుడితో కలిసి మూడేళ్ల కన్నకూతుర్ని చంపి గ్రామ శివారులో వాగు దగ్గర పూడ్చి పెట్టామని మమత పోలీసులకు చెప్పింది. ఘటనా స్థలానికి ఇరువుర్నితీసుకెళ్లిన పోలీసులు ఈ రోజు చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అమ్మా, అమ్మా అంటూ నోరారా పిలిచిన ఆ పసి పిల్లను చంపుకోవడానికి నీకు చేతులు ఎలా వచ్చాయమ్మా? అంటూ ఈ ఘోరం గురించి తెలిసిన వారందరూ నివ్వెరపోతున్నారు.

