ADB | అశ్రునయనాల మధ్య మైలారపు అడెల్లు అంతిమ వీడ్కోలు

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : చత్తీస్ ఘ‌డ్ నేషనల్ పార్క్ ఏరియాలో ఎన్ కౌంట‌ర్ (Encounter) లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత మైలారపు అడెల్లు ( Mylarapu Adellu ) అలియాస్ భాస్కర్ అంత్యక్రియలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర ( pochera ) లో జరిగాయి. 35ఏళ్ల సాయుధ బాట అనంతరం పోలీసుల కాల్పుల్లో నేలకొరిగిన అడెల్లు మృతదేహాన్ని కడసారి చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది హాజరై నివాళులర్పించారు. పీడిత వర్గాల కోసం మూడున్నర దశాబ్దాల కిందట అడవి బాట పట్టి రగల్ జెండాతో ఉద్యమంలో ఉన్నత స్థాయికి ఎదిగిన అడెల్లు అలియాస్ భాస్కర్ విగతజీవిగా ఇంటికి తిరిగి రావడంపై గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల రోధనలకు అంతులేకుండా పోయింది. అరుణోదయ తార అడెల్లు నింగికేగడం ఊహించలేకపోయామని మావోయిస్టు బంధుమిత్రుల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఎర్ర జెండాలు చేత పట్టుకుని, మైలారపు అడెల్లు అమర్ హై అంటూ వేలాదిమంది దారి పొడుగునా నినదించారు.

కగార్ ఆపరేషన్ ఆపివేయాల్సిందే..
బూటకపు ఎన్ కౌంట‌ర్ల పేరిట బహుజన విప్లవకారులను అంతమొందించడానికే కగార్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. అడెల్లు భౌతిక కాయాన్ని సందర్శించి ఎమ్మెల్యే (MLA) నివాళులర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించి ఓదార్చారు. తెలంగాణ మావోయిస్టు ఉద్యమకారులను మట్టు పెట్టడమే లక్ష్యంగా సాగుతున్న కగార్ ఆపరేషన్ నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని విప్లవ రచయితల సంఘం, పౌర హక్కుల సంఘం, మావోయిస్టు బంధుమిత్రుల కమిటీ ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అంతిమయాత్ర (final journey) లో అరుణోదయ కళాకారులు డప్పు చప్పులతో విప్లవ గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. మూడు గంటల పాటు సాగిన అంతిమయాత్రలో సుమారు 3వేల మంది హాజరు కావడం గమనార్హం. అంతిమ యాత్రలో సికాస మాజీ సీఈవో సుధాకర్ అలియాస్ ఉషన్న, పౌర హక్కుల సంఘం నేతలు గడ్డం లక్ష్మణ్, నారాయణ కుమారస్వామి, తుడుం దెబ్బ నాయకులు గణేష్, రేణుక, మావోయిస్టు మాజీ ఉద్యమ నేతలు మురళి అజయ్ అశోక్ జ్యోతి, జయ, శ్రీకాంత్, విరసం నేత పాణి, సిపిఐ నాయకులు ప్రభాకర్ రెడ్డి, మావోయిస్టు బంధుమిత్రుల కమిటీ నేతలు పద్మకుమారి, శాంతక్క పాల్గొన్నారు.

Leave a Reply