సెలెక్టర్లకు సవాల్

సెలెక్టర్లకు సవాల్

  • ఫిట్‌నెస్ అనుమానాలకు బదులిచ్చిన షమీ

భారత క్రికెట్ జట్టులో తన ఫిట్‌నెస్‌పై వ్యక్తమవుతున్న అనుమానాలను వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గట్టిగా తిప్పికొట్టాడు. 2025–26 రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతున్న ష‌మీ.. తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని నిరూపించేందుకు సిద్ధమయ్యాడు.

రంజీ ట్రోఫీలో బెంగాల్ తొలి మ్యాచ్‌కు ముందు మాట్లాడిన షమీ, తాను నాలుగు రోజుల క్రికెట్ ఆడుతున్నానంటే, అది తాను పూర్తిగా ఫిట్‌గా, ఆటకు సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని స్పష్టంగా చూపిస్తుందని చెప్పాడు.

కాగా, షమీ చివరగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జ‌ట్టులో క‌నిపించాడు. ఆ తర్వాత టీమిండియా టెస్టుల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లడం, ఆసియా కప్ టీ20 గెలవడం, వెస్టిండీస్‌పై 2-0తో వైట్‌బాల్ సిరీస్ గెలవడం వంటి విజయాలను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో, రాబోయే ఆస్ట్రేలియా వైట్‌బాల్ టూర్ నుంచి కూడా తనను తప్పించడంపై షమీ స్పందించాడు.

జట్టు నుంచి తనను తప్పించడంపై ష‌మీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “నేను నాలుగు రోజుల రంజీ ట్రోఫీ క్రికెట్ ఆడగలిగితే, 50 ఓవర్ల క్రికెట్ కూడా ఆడగలను” అని తేల్చి చెప్పాడు.

నిరంతరం తన ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని షమీ పేర్కొన్నాడు. “అప్‌డేట్‌లు ఇవ్వడం నా బాధ్యత కాదు. నా పని ఎన్‌సీఏ (నేషనల్ క్రికెట్ అకాడమీ)కి వెళ్లి శిక్షణ తీసుకొని, మ్యాచ్‌లు ఆడటమే. దీని గురించి మాట్లాడి వివాదం సృష్టించాలని నేను అనుకోవడం లేదు,” అని అతను అన్నాడు.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్ పై మాటల యుద్ధం..

షమీ రంజీ ట్రోఫీకి తిరిగి రావడం, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నేరుగా బదులివ్వడంలా కనిపిస్తోంది. గత రెండేళ్లలో షమీ తక్కువ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడటాన్ని అగార్కర్ ప్రస్తావిస్తూ, టెస్ట్ క్రికెట్‌కు దూరం కావడానికి అదే కారణమని చెప్పాడు.

చీలమండ, మోకాలి గాయాల నుంచి కోలుకున్న తర్వాత కేవలం తొమ్మిది అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షమీ, అగార్కర్ సూచనను పాటించినట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ 2025లో 30 ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత, ఆగస్టులో దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడిన షమీ, ఇప్పుడు రంజీ ట్రోఫీతో తాను పూర్తిగా ఫిట్‌గా, ఆటకు సిద్ధంగా ఉన్నానని మరోసారి రుజువు చేస్తున్నాడు.

దేశీయ క్రికెట్‌కు విలువనిస్తున్న షమీ

197 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అద్భుతమైన కెరీర్ ఉన్నప్పటికీ, దేశీయ క్రికెట్‌పై షమీకి ఉన్న గౌరవం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. రాష్ట్ర స్థాయిలో ఆడటానికి తాను సిద్ధంగా ఉండటం ఇతరులకు కూడా ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని అతను భావిస్తున్నాడు.

“నన్ను టీమిండియాకు ఎంపిక చేయకపోయినా, నేను ఇక్కడికి వచ్చి నేష‌న‌ల్ ట్రోఫీలు ఆడతాను. దీనిపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు,” అని షమీ అన్నారు.

రంజీ ట్రోఫీ ప్రతిష్ట గురించి కూడా షమీ స్పష్టంగా మాట్లాడాడు. “ఒకప్పుడు రంజీ ట్రోఫీ చాలా పెద్ద స్థాయి క్రికెట్. కానీ ఈ రోజుల్లో, రంజీ ట్రోఫీ లాంటి దేశీయ క్రికెట్ ఆడటాన్ని కొందరు తక్కువ స్థాయిగా భావిస్తున్నారు. కానీ నేను అలా అనుకోను. ఒక నిజమైన క్రికెటర్ అయితే, నాలుగు రోజుల ఆట కూడా ఆడటానికి సిద్ధంగా ఉండాలి,” అని షమీ అన్నారు.

రంజీ ట్రోఫీలో ఆడటం ద్వారా, షమీ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడమే కాకుండా, సెలెక్టర్లు కోరుతున్న ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడుతూ, త్వరలో జాతీయ జట్టులోకి తిరిగి రావాలని కూడా ఆశిస్తున్నాడు.

Leave a Reply