Reservation | ఓసీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి

Reservation | ఓసీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి
Reservation | తొర్రూరు, ఆంధ్రప్రభ : ఓసీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తొర్రూరు ఓసి జేఏసీ బాధ్యుడు ముద్దం విక్రమ్ రెడ్డి అన్నారు. ఓసి జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించే ఓసీల సింహ గర్జన భారీ బహిరంగ సభకు ఈ రోజు తొర్రూరు మండలంలోని పలు ప్రాంతాల నుంచి ఓసి నాయకులు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు. విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ….విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఓసీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీల మాదిరి ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ఓపెన్ కేటగిరిలో అన్ని సామాజిక వర్గాలు పోటీ పడడం వల్ల ఓసీలకు అన్యాయం జరుగుతుందన్నారు.
సామాజిక వివక్షత అంతమొందుతుందని, ప్రస్తుతం ఆర్థిక వివక్షత కొనసాగుతుందన్నారు. ఆర్థిక వెనకబాటు కోణంలో రిజర్వేషన్ ఫలాలు అందించాలన్నారు. సామాజిక భద్రత కోసమే ఓసీల పోరాటమని, ఓసీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఓసి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతులు లేని ఐదు సంవత్సరాల కాల పరిమితి కలిగి ఉండాలన్నారు. విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షల వయోపరిమితి పెంచాలని, బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఈ డబ్ల్యూ ఎస్ విద్యార్థులకు టెట్ రాత పరీక్ష అర్హతకు 90 మార్కుల నుండి 70 మార్కులకు తగ్గించాలన్నారు. ఓసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫతేపురం సర్పంచ్ ఇట్టె మాధవరెడ్డి, నాయకులు ప్రొద్దుటూరి గౌరీ శంకర్, మచ్చ సురేష్, లేగల వెంకట్ రెడ్డి, రావుల అనిల్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, జక్కుల రామ్ రెడ్డి, అనుమాండ్ల సుధాకర్ రెడ్డి , సోమిరెడ్డి, సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
