AP | సూపర్ స్టార్ విగ్రహావిష్క‌ర‌ణ

AP | సూపర్ స్టార్ విగ్రహావిష్క‌ర‌ణ

  • లెనిన్ సెంటర్‌లో రామరాజు గెటప్‌లో కృష్ణ విగ్రహం
  • విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు
  • హాజ‌రైన ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు
  • మెరిసిన కృష్ణ మనవడు జయకృష్ణ

AP | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ లెనిన్ సెంటర్‌లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని పద్మాలయా సంస్థ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణలు ఆవిష్కరించారు. కృష్ణ నటించిన చారిత్రాత్మక చిత్రం ఈనాడులోని రామరాజు పాత్ర గెటప్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ కృష్ణకు విజయవాడతో ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. కృష్ణ అభిమానులు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. మూడో తరం హీరోగా రంగప్రవేశం చేస్తున్న జయకృష్ణ అద్భుతమైన విజయాలు సాధించాల‌ని ఆకాంక్షించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణకు విజయవాడ అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉందన్నారు. ఈనాడు చిత్రంలోని పాత్రను విగ్రహ రూపంలో ఏర్పాటు చేయ‌డం అభినందనీయమని తెలిపారు. జయకృష్ణను నిర్మాత అశ్వనీదత్ వెండితెరకు పరిచయం చేయడం ఆనందకరమని, ఆయన చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం రగిలించిన విప్లవాత్మక చిత్రాలు కృష్ణ ఖ్యాతిని మరింత పెంచాయన్నారు. ఈనాడు చిత్రం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపిన చారిత్రాత్మక చిత్రం అని గుర్తు చేశారు. కృష్ణ సినీ పరిశ్రమలో గొప్ప వ్యక్తిగా ఎమ్మెల్యే బోండా ఉమా కొనియాడారు. తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. జయకృష్ణకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ కృష్ణతో అనేక చిత్రాలు నిర్మించిన అనుభవాన్ని గుర్తుచేశారు. కృష్ణ తరువాత మహేష్ బాబును, ఇప్పుడు జయకృష్ణను పరిచయం చేయడం తనకు గర్వకారణమన్నారు.

దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ఘట్టమనేని లెగసీ కొనసాగాలని ఆకాంక్షించారు. జయకృష్ణ మాట్లాడుతూ అభిమానులను కలవడం ఆనందంగా ఉందని, కృష్ణ పేరు నిలబెట్టడమే తన లక్ష్యమని చెప్పారు. బాబాయ్ మహేష్ బాబు పూర్తి సహకారం ఉందని, తన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం యాక్షన్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, నిర్మాతలు, విగ్రహ కమిటీ సభ్యులు సుధా, సీరం బుజ్జి, జితేంద్రతో పాటు భారీ సంఖ్యలో కృష్ణ అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply