Kurnool | పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలి

Kurnool | పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి.
Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : గ్రామాల్లో ఇంటింటికి చెత్త సేకరణతో పాటు పారిశుద్ధ్య పనులను ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందే విధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇవాళ ఉదయం జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో గ్రామాల్లో చెత్త సేకరణ, పారిశుద్ధ్యం, పరిశుభ్రత అంశాలపై జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రతి గ్రామ పంచాయతీ, హ్యాబిటేషన్‌లో ఇంటింటి నుండి చెత్త సేకరణ తప్పనిసరిగా జరగాలని, ఎక్కడా చెత్త పేరుకుపోయిన పరిస్థితులు కనిపించకూడదని స్పష్టం చేశారు. చెత్త సేకరణ వాహనాలు గ్రామంలోని అన్ని వీధులు, కాలనీలు కవర్ చేసేలా రోజువారీగా పనిచేయాలన్నారు. చెత్త సేకరణ జరగలేదని ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులు వచ్చే పరిస్థితి ఉండకూడదని హెచ్చరించారు. గ్రామాలు పరిశుభ్రంగా, ఆరోగ్యకర వాతావరణంతో ఉండేలా పారిశుద్ధ్య చర్యలు నిరంతరంగా చేపట్టాలని, ముఖ్యంగా డ్రైన్లు, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.పంచాయతీ సెక్రెటరీ లు ఈ పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న గ్రామాలలో డిప్యూటీ ఎంపీడీవోలు స్వయంగా పర్యవేక్షణ చేపట్టి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో కీలకంగా పనిచేస్తున్న క్లాప్ మిత్రలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. చెత్త సేకరణ వాహనాలలో ఏవైనా మరమ్మతులు అవసరమైతే, పంచాయతీ నిధుల నుండి వెంటనే మరమ్మతులు చేపట్టి పనుల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
అలాగే గ్రామాల్లో పెన్షన్ పంపిణీ చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి, పెన్షన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. పెన్షన్ పంపిణీలో లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఫిర్యాదులు వస్తే, వాటిని విచారణ నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. టెలి కాన్ఫరెన్స్ లో డిపిఓ భాస్కర్, జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.
