AP | సమస్యలకు పరిష్కారమే లక్ష్యం

AP | సమస్యలకు పరిష్కారమే లక్ష్యం
- ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
- సెంట్రల్‌లో ఎమ్మెల్యే బొండా ఉమ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్
AP | పాయికాపురం, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజా దర్బార్ నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రజాదర్బార్ కార్యక్రమం ఈ రోజు సింగ్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించారు. ప్రజల నుంచి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు. తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాదర్బార్ ప్రజలకు ప్రభుత్వాన్ని నేరుగా చేరువ చేసే ప్రభావవంతమైన వేదికగా మారిందన్నారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం, మౌలిక వసతులు, సచివాలయ సేవలు, రహదారులు, డ్రైనేజీలు వంటి అంశాలపై వచ్చిన అర్జీలను జవాబుదారీతనంతో పరిష్కరిస్తున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత 18 నెలల్లో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించామని, రహదారులు, డ్రైనేజీలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్ల అభివృద్ధికి రూ.300 కోట్లకు పైగా వ్యయంతో పనులు చేపట్టామని వివరించారు.
సంక్షేమ పథకాల అమలుపై మాట్లాడుతూ పెన్షన్ల పెంపు, తల్లికి వందనం పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్లు, రైతులకు ఆర్థిక భరోసా వంటి పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలపై ఇప్పటివరకు రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయగా, అందులో గత 18 నెలల్లో కేవలం పెన్షన్లకే రూ.60 వేల కోట్లకు పైగా వెచ్చించినట్టు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, నాగవంశ రాష్ట్ర చైర్మన్ ఎరుబోతు రమణ, వెలగ సురేష్, మహిళా నాయకులు, స్వర్ణాంధ్ర @2047 టీమ్ సభ్యులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
