Narayanpet | రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి

Narayanpet | రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి

ఎస్పీ డాక్టర్ వినీత్

Narayanpet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. ఇవాళ‌ ఉదయం నారాయణపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతకు సంబంధించిన సూచిక బోర్డుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ, ఆర్టీఎ మెంబర్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా డీటీఓ అధికారి మెగా గాంధీ, ఆర్టీఎ మెంబర్ పోషల్ రాజేష్ కలిసి రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించేలా రూపొందించిన మొత్తం 18 సూచిక బోర్డులను జిల్లా పోలీస్ శాఖకు వితరణ చేశారు. ఈ బోర్డుల్లో “గో స్లో”, సెల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడపరాదు, మద్యం సేవించి వాహనాలు నడపరాదు, మితిమీరిన వేగంతో వాహనాలు నడపరాదు, త్రిబుల్ రైడింగ్ చేయరాదు, రాంగ్ రూట్లో వాహనాలు నడపరాదు వంటి స్లోగన్లు ఉన్నాయి. వీటిని ముఖ్యంగా స్కూల్ జోన్ ప్రాంతాలు, కళాశాలల సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, రవాణా శాఖలతో పాటు ప్రజలందరి సమిష్టి బాధ్యత అవసరమన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల సమీపంలో వాహనదారులు నెమ్మదిగా వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు భద్రత కోసం విలువైన సూచిక బోర్డులను అందించిన ఆర్టీఏ మెంబర్ పోషల్ రాజేష్‌ను జిల్లా ఎస్పీ అభినందించారు. మొదటగా జిల్లా కేంద్రంలో ఈ సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం అభినందనీయమని, తదుపరి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన రహదారుల వద్ద వీటిని ఏర్పాటు చేసి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, వారి ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు–రవాణా శాఖ సమన్వయంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా పరిధిలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హాక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, ఆర్‌ఐలు నరసింహ, విజయ్ భాస్కర్, ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణ చైతన్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply