CM Cup-2026 | క్రీడారంగంలో…

CM Cup-2026 | క్రీడారంగంలో…
- నిజామాబాద్ ఖ్యాతిని ఇనుమడింపజేయాలి
- కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు
- అర్బన్ ఎమ్మెల్యేతో కలిసి సీఎం కప్ టార్చ్ రిలే ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్
CM Cup-2026 | నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ : క్రీడా రంగంలో నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేయాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీ.ఎం కప్-2026 సెకండ్ ఎడిషన్ క్రీడా పోటీలను పురస్కరించుకుని ఇవాళ నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి జెండా ఊపి టార్చ్ రిలే ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. పాలిటెక్నిక్ మైదానం నుండి ప్రారంభమైన టార్చ్ రిలే ర్యాలీ, ప్రధాన మార్గాల మీదుగా పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లా నుండి నిఖత్ జరీన్, యెండల సౌందర్య, గూగులోత్ సౌమ్య, హుస్సాముద్దీన్ వంటి అనేక మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తుండడం ఎంతో గొప్ప విషయమన్నారు. వీరిని స్పూర్తిగా తీసుకుని విద్యార్థినీ, విద్యార్థులు, గ్రామీణ ప్రాంత క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. క్రీడల్లో ధనిక, పేద అనే తారతమ్యం ఉండదని, ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ప్రతిభనే కొలమానమని క్రీడాకారులకు మార్గనిర్దేశం చేశారు.

అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ… విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, దురలవాట్ల బారిన పడకుండా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, ఇందుకు క్రీడలను వేదికగా మల్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్ లు, క్రీడాకారులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
