ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 9 (ఆడియోతో…)

భాగవతం, ఏకాదశ స్కందంలోని ఋషి ప్రభోదం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

వాచికై: పక్షిమృగతాం మానసై: వాయురుపతాం
శరీరజై: కర్మదోషై: యాతి స్థావరతాం నర:

వాక్కుతో తప్పు చేస్తే పక్షలు మరియు మృగములుగా పుడతారు. మానసిక అపరాధం చేస్తే భూతప్రేతములుగా పుడతారు. శరీరంతో చేసే పనులలో తప్పు చేస్తే చెట్లుగా, గుట్టలుగా పుడతారు. ఏ అవయవంతో తప్పు చేస్తే పరమాత్మ ఆ అవయవాన్ని తప్పిస్తాడు.

వాక్కుతో తప్పు చేస్తే అనగా ఎదుటవారిని నిందించడం, మాటలతో హేళన చేయడం, అబద్ధాలు ఆడడం, మనస్సులో ఉన్నది కాక బయటకు వేరే మాట్లాడటం, అధిక్షేపించడం వంటివి వాక్కు దోషాలు. ఇటువంటి తప్పులు చేస్తే మాట్లాడలేని పక్షులుగా, మృగములుగా జీవిస్తారు. మానవుడు కూడా మాట్లాడటం మాని అందరిపై అరిస్తే అరిచే పక్షిగా, మృగముగా జన్మిస్తాడు.

మనస్సుతో అపచారం చేస్తే అంటే అధర్మాన్ని సంకల్పించి మనస్సుతో అభిలషిస్తే అనగా ఎదుటివారికి హాని కలిగించక ఎదుటివారి ధనాన్ని అపహరిస్తే బాగుండు అని అనుకోవడం, అందమైన యువతి తారసపడితే మానసిక వ్యభిచారానికి దిగి అసత్యమైన ఆనందం పొందటం వంటివి మానసిక దోషాలు. ఈ దోషాలను ఆచరిస్తే మనస్సు మాత్రమే మిగిలి ఉన్న భూత, ప్రేత, పిశాచులుగా పుడతారు.

శరీరంతో తప్పు పనులు చేస్తే అనగా ఎదుటివారిని హింసించడం, ఎదుటివారి ధనాన్ని హరించడం, పరస్త్రీలతో రమించడం, స్త్రీలు, బాలలు, వృద్ధులను హింసించడం వంటివి శరీర దోషాలు. చూడకూడని వాటిని చూడటం, వినకూడని మాటలు వినడం, తినకూడనివి తినడం, వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళడం, తాకకూడని వాటిని తాకడం ఇవన్నీ కూడా శరీర దోషాలే. ఈ దోషాలు చేస్తే రాయిరప్పలుగా, చెట్టుపుట్టలుగా జన్మిస్తారు.

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *