POLICE | గంజాయిపై ఉక్కుపాదం

POLICE | గంజాయిపై ఉక్కుపాదం

  • కదిరిలో గంజాయి బ్యాచ్‌కు స్పెషల్ ట్రీట్మెంట్
  • విక్రేతలను రోడ్డుపై ఊరేగించిన పోలీసులు
  • నలుగురు గంజాయి విక్రేతల అరెస్ట్
  • 12 మంది సేవకులు అదుపులోకి

POLICE | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో గంజాయి మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయి విక్రయాలు, సేవించ‌డాన్ని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా కదిరి పోలీసులు చేపట్టిన ప్రత్యేక దాడులు ఇవాళ‌ పట్టణవ్యాప్తంగా కలకలం రేపాయి. గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన నలుగురు ప్రధాన నిందితులను బహిరంగంగా రోడ్డుపై నడిపించి టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించడం ద్వారా కఠిన హెచ్చరిక ఇచ్చారు.

పట్టణంలోని పలు ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు కదిరి డీఎస్పీ ఆదేశాలపై టౌన్ సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి యువతను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.

అరెస్టైన నలుగురు నిందితులను పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా రోడ్డుపై నడిపించడం ద్వారా గంజాయి వ్యాపారంలో ఉన్నవారికి పోలీసులు గట్టి సందేశం ఇచ్చారు. ప్రజల్లో భయభ్రాంతులు తొలగించి, గంజాయి వంటి మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడమే ఈ చర్య ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

ఇదే సమయంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన మరో 12 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది యువకులే ఉండటం ఆందోళన కలిగించే అంశమని పోలీసులు పేర్కొన్నారు. గంజాయి సేవించడం వల్ల ఆరోగ్యం, కుటుంబ భవిష్యత్, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందనే విషయాన్ని వారికి వివరించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అవసరమైన చట్టపరమైన చర్యలు కూడా చేపట్టినట్లు తెలిపారు.

కదిరి పట్టణాన్ని గంజాయి రహిత ప్రాంతంగా మార్చడమే లక్ష్యంగా ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. గంజాయి విక్రయాలు, సేవనంపై ఎలాంటి రాజీలేదని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా పెంచాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
గంజాయి మాఫియాపై పోలీసులు తీసుకున్న కఠిన చర్యలకు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా దాడులు కొనసాగితే యువత భవిష్యత్ సురక్షితంగా ఉంటుందని, కదిరి ప్రశాంత పట్టణంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply