కరీంనగర్, ఆంధ్రప్రభ | ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపుకు 21 టేబుళ్ళు, టీచర్స్ ఓట్ల లెక్కింపుకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ముందుగా బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను కుప్పగా పోసి కట్టలు కట్టే ప్రక్రియ ప్రారంభించారు. 50ఓట్లకు ఒక కట్ట కడుతున్నారు. కట్టలు కట్టే ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థుల వారిగా మొదటి ప్రాధాన్యత ఓటు ప్రకారం వేరు చేయనున్నారు. ఆ తర్వాత లెక్కింపు చేపట్టి ఎవరికి ఎన్ని వచ్చాయని తేలుస్తారు.
ఓట్ల లెక్కింపునకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడ్ లతో పాటు ఇతర అభ్యర్థులు చేరుకున్నారు. పట్టభద్రుల స్థానానికి 56మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 3,55,159 మంది పట్టభద్రుల ఓటర్లలో 2,50,328 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీచర్స్ స్థానానికి 15మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా టీచర్స్ ఓటర్లు 27,088 మందికి గాను 24,968 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓట్ల లెక్కింపునకు మూడు షిఫ్టుల్లో కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ జరిగే అంబేడ్కర్ స్టేడియం వద్ద అడిషనల్ డీసీపీతో పాటు ఆరుగురు ఏసీపీలు, 18మంది సీఐలు, 30మంది ఎస్సైలతో సహా 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితం ఈరోజు సాయంత్రం వరకు వస్తుందని భావిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితం మాత్రం ఇవాళ వెలువడే అవకాశం లేదని మంగళవారం రాత్రి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
భారీగా చల్లని ఓట్లు..
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో గ్రాడ్యుయేట్లు పెద్ద మొత్తంలో చెల్లని ఓట్లు వేసినట్లు సమాచారం. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సిబ్బంది వ్యాలీడ్, ఇన్ వ్యాలీడ్ ఓట్లను సపరేట్ చేస్తున్నారు. పట్టభద్రుల కౌంటింగ్ లో పెద్ద మొత్తంలో చెల్లనిఓట్లు నమోదు అవుతుండడం గమనార్హం. ఈ ప్రభావం ఎవరిపై పడుతుందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.