హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్‌ల పదవీ కాలం మార్చి 29తో ముగియనున్నది. ఈ ఐదు స్థానాలు భర్తీ చేసేందుకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
షెడ్యూల్
- మార్చి మూడో తేదీన నోటిఫికేషన్ జారీ
- మార్చి మూడు నుంచి పదో తేదీవరకూ నామినేషన్ల స్వీకరణ
- మార్చి 11న నామినేషన్ల పరిశీలన
- మార్చి 13న నామినేషన్ల ఉపసంహరణ
- మార్చి 20వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్
- మార్చి 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ
తెలంగాణలో మరో సమరానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్ధం
తెలంగాణలో మరో సమరానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్ధమయ్యాయి. ఉపాధ్యాయ, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం శాసనసభలో పార్టీలకున్న సంఖ్యా బలాన్ని బట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి మూడు ఎమ్మెల్సీ స్థానాలు, బీఆర్‌ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. ఒక్క సీటుకు పోటీ అనివార్యం. కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంఐఎం ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు సపోర్టు చేస్తే మరో సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళుతుంది. లేకుంటే ఒక టికెట్ కోసం పోటీ జరుగుతుంది.
టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్ల కోసం ఇరు పార్టీలో తీవ్ర పోటీ ఉంది. కాంగ్రెస్‌కు ఒక టికెట్‌కు ఐదుగురు పోటీ పడుతుండగా, అదే స్థాయిలో బీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ నెలకొంది. ఇక్కడ టికెట్ దక్కితే చాలు గెలుపు ఖాయం కానున్న నేపథ్యంలో టికెట్ దక్కించుకోవడానికే నేతలందరూ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.
ప్రాధాన్యత సంతరించుకున్న సీఎం ఢిల్లీ టూర్
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులకు, పార్టీ నేతలకు కలవడానికి ఢిల్లీ కి వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీఎం ఢిల్లీ వెళ్లడంపై పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్సీ టికెట్ల విషయంపై అధిష్ఠానంతో చర్చించనున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.