Chittoor | ఆ రోజే ముక్కోటి ఏకాదశి

Chittoor | ఆ రోజే ముక్కోటి ఏకాదశి

Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ : హిందూ ధర్మ సంప్రదాయంలో కాలగణనకు, ఆచారాలకు ఉన్న ప్రాధాన్యం అనన్యసామాన్యం. పండుగలన్నీ చంద్రమానం లేదా సౌరమానం ప్రకారం జరుపుకున్నా, ఈ రెండు మహా కాలగణనల సంగమంగా ఆచరించబడే అపూర్వమైన పుణ్యతిథి ఒక్కటే. అదే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం వచ్చే శుద్ధ ఏకాదశి (Shuddha Ekadashi) తిథినాడు ఈ మహా పర్వదినం వైభవంగా ఆచరించబడుతుంది. సౌరమానం, చంద్రమానం కలయికతో వచ్చే ఈ తిథి కారణంగానే ముక్కోటి ఏకాదశి హిందువుల ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది.

ఈ రోజున ముక్కోటి దేవతలు అందరు శ్రీమహావిష్ణువును దర్శించుకున్నాయని పురాణ గాథ చెబుతోంది. మూడు కోట్ల దేవతలు ఒకేసారి విష్ణుమూర్తిని దర్శించిన పవిత్ర ఘడియగా ఈ తిథిని భావిస్తారు. అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి అనే నామం స్థిరపడింది. అంతేకాదు, ఈనాడే మధు, కైటభులనే రాక్షసులకు శాపవిమోచనం కల్పించి, వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనం అనుగ్రహించిన కరుణాసాగరుడు శ్రీహరి. మధు, కైటభులు విష్ణుమూర్తిని శరణు కోరుతూ, తమలాగే ఈ పుణ్యతిథినాడు వైకుంఠ ద్వారాన్ని (Gateway to Vaikuntha) పోలిన ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామిని దర్శించుకుంటే వారికి మోక్షం ప్రసాదించాలని వరం కోరారట. ఆ వరాన్ని శ్రీహరి అంగీకరించడంతో, అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శన ఆచారం ప్రారంభమైందన్నది భక్తుల విశ్వాసం. ఇదే ఉత్తర ద్వార దర్శనానికి ఉన్న మూల గాథ.

Chittoor

వైకుంఠ ఏకాదశినాడు వైకుంఠంలోని విష్ణుమూర్తి అంతరంగిక ద్వారాలు తెరుచుకుంటాయని నమ్మకం. భూమ్మీద ఉన్న ఆలయాలలోనూ అదే ప్రతీకగా ఉత్తర ద్వారాన్ని ప్రత్యేకంగా తెరిచి ఉంచుతారు. ఉత్తరం దిశ ఆధ్యాత్మికంగా దేవతల దిశగా భావించబడుతుంది. ఉత్తరాయణం దేవయానం కాగా, దక్షిణాయణం పితృయానమని శాస్త్రోక్తి. అందుకే ఉత్తర ద్వారం గుండా దర్శనం చేయడం మోక్ష మార్గానికి సంకేతంగా భావిస్తారు. ఈ విశ్వాసమే ఉత్తర ద్వార దర్శనానికి అత్యంత ప్రాధాన్యాన్ని తీసుకువచ్చింది. అసలు ఏకాదశి అంటేనే హిందువులకు పరమ పవిత్రమైన తిథి. పూర్వం మురాసురుడనే రాక్షసుని సంహరించేందుకు విష్ణుమూర్తి నుండి ఒక దివ్యశక్తి (Divine power) అవతరించిందట. ఆ శక్తియే ఏకాదశి దేవతగా పూజింపబడుతోంది. ఆమె సేవకు మెచ్చిన విష్ణుమూర్తి, తిథులలోకెల్లా ఏకాదశి అత్యుత్తమమైనదని, ఆ రోజు నిష్ఠగా వ్రతం ఆచరించేవారు తప్పకుండా వైకుంఠాన్ని చేరుకుంటారని వరమిచ్చాడు. అందుకే ప్రతి ఏకాదశినాడు ఉపవాసం ఉండటం మన సంప్రదాయంగా మారింది. ఏకాదశి వ్రతం వల్ల పుణ్యంతో పాటు ఆరోగ్యమూ లభిస్తుందని పెద్దల విశ్వాసం.

Chittoor

ఉపవాసం ద్వారా శరీర శుద్ధి, మనస్సు నిగ్రహం, ఇంద్రియ నియంత్రణ సాధ్యమవుతాయని భావిస్తారు. అయితే.. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే, మిగతా అన్ని ఏకాదశుల ఫలమూ ఒక్క రోజులోనే దక్కుతుందని శాస్త్రవచనం. వైకుంఠ ఏకాదశి వ్రత విధానం కూడా అత్యంత నియమబద్ధంగా ఉంటుంది. దశమి నాటి రాత్రి నుంచే ఉపవాసానికి ఉపక్రమించాలి. ఏకాదశి నాడు తులసి తీర్థాన్ని మాత్రమే సేవిస్తూ అన్నపానీయాలకు (food and drink) దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ రోజున బియ్యంతో చేసిన ఆహారం పూర్తిగా నిషిద్ధం. ఏకాదశి నాడు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడన్న నమ్మకం వెనుక, ఉపవాసాన్ని కఠినంగా పాటించాలన్న శాస్త్రోపదేశమే దాగి ఉందని పండితులు చెబుతారు. రాత్రివేళ జాగరణ చేస్తూ నిద్రను జయించడమే ఈ వ్రత సారాంశం. ఆకలి, నిద్రలను అదుపులో పెట్టుకోవడమే ఏకాదశి వ్రత విశిష్టతగా భావిస్తారు. మరుసటి రోజు ద్వాదశి నాడు అన్నదానం చేసి, ఆ తరువాతే ఉపవాసాన్ని విరమించాలి.

Chittoor

వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలు అన్నింటిలో ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. సాధారణ రోజుల్లో మూసివుండే ఉత్తర ద్వారాన్ని ఈ ఒక్క రోజునే భక్తుల కోసం తెరిచి ఉంచుతారు. ఆ ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం వల్ల జన్మ జన్మల పాపాలు నశించి మోక్షం లభిస్తుందన్న విశ్వాసంతో భక్తులు (Devotees) గంటల తరబడి క్యూలలో నిలుస్తారు. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రోజున శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఉత్తర ద్వార దర్శనంతో పాటు, ఏకాదశి నాడు మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశి నాడు పుష్కరణిలో జరిగే చక్రస్నానం దర్శించుకున్న భక్తులు పుణీతులవుతారని నమ్మకం.

మార్గశిర మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశిని మోక్షదైకాదశి అని కూడా పిలుస్తారు. వైఖానసుడు అనే రాజు తన తండ్రిని నరకలోకం నుంచి విముక్తి చేయడానికి ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించాడన్న పురాణ గాథ ప్రసిద్ధి. ఆ వ్రత ఫలితంగా అతని తండ్రి నరకం నుంచి విడుదలై స్వర్గలోకానికి చేరుకున్నాడట. అందుకే ఈ ఏకాదశి మోక్షాన్ని (Ekadashi Moksha) ప్రసాదించే మహా తిథిగా పేరుగాంచింది. భౌతిక జీవితం నుంచి ఆధ్యాత్మిక లోకానికి దారి చూపే మహాద్వారమే ఉత్తర ద్వారం. ఆ ద్వారం గుండా జరిగే దర్శనం.. భక్తుడి హృదయ ద్వారాన్ని కూడా తెరుస్తుందన్నది ఆచార్యుల మాట. తరతరాలుగా మన పెద్దలు కాపాడుకుంటూ వచ్చిన ఈ సంప్రదాయం, నేటి తరానికి ఆధ్యాత్మిక మూలాలను గుర్తు చేస్తోంది. ముక్కోటి ఏకాదశి… కేవలం పండుగ కాదు, మోక్షానికి మార్గం చూపే మహాపర్వం.

CLICK HERE TO READ  స్వర్ణగిరిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

CLICK HERE TO READ MORE

Leave a Reply