Bharatiya Kisan Sangh | కందుల కొనుగోళ్లలో జాప్యం …

Bharatiya Kisan Sangh | కందుల కొనుగోళ్లలో జాప్యం …

Bharatiya Kisan Sangh | నారాయణపేట, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లాలో కందుల కొనుగోలు ప్రారంభించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇవాళ‌ నారాయణపేటలోని భారతీయ కిసాన్ సంఘ్(Bharatiya Kisan Sangh) కార్యాలయంలో ఉట్కూర్, నారాయణపేట, దామరిగిద్ద, ధన్వాడ, మక్తల్ ప్రాంతాలకు చెందిన రైతులు సమావేశమై, కందుల కొనుగోలు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలోనే ప్రభుత్వం కందుల కొనుగోలు ప్రారంభించేదని, కానీ ఈ ఏడాది ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో కందుల ధర క్వింటాల్‌కు రూ.6000 నుంచి రూ.7000 వరకే ఉండటంతో రైతులకు క్వింటాల్(Quintal) కు సుమారు రూ.2000వరకు నష్టం జరుగుతోందన్నారు.

నారాయణపేట జిల్లా తెలంగాణలో కందుల పంటకు ప్రధాన కేంద్రంగా ఉన్నదని, ముఖ్యంగా మెట్ట ప్రాంతమైన ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా కందుల సాగుపైనే ఆధారపడతారని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం రైతులను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం(Central Government) కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ, కొనుగోళ్లు ప్రారంభించకపోవడం వల్ల ఆ ప్రయోజనం రైతులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గత వారం జిల్లా కలెక్టర్‌కు, వ్యవసాయ మార్కెట్(agricultural market) కమిటీ చైర్మన్‌కు, వ్యవసాయ శాఖ అధికారులకు, పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ కు ఈ సమస్యను విన్నవించినప్పటికీ స్పందన లేకపోవడంతో, ఇకపై నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కందుల కొనుగోలు ప్రారంభించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో భారతీయ కిసాన్ సంఘ్(Kisan Sangh) రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెంకోబ, జిల్లా కార్యదర్శి అనంత రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శాసమల బాలప్ప, జిల్లా సహాయ కార్యదర్శి మైపాల్ రెడ్డి, కోశాధికారి పటేల్ రంగారెడ్డి, మండల అధ్యక్షులు గణప్ప, శ్రీనివాస్, జాజపూర్ లక్ష్మీకాంత్, శాసనపల్లి కూర రాములు, షేర్‌నపల్లి ఉట్కూర్ మండల అధ్యక్షుడు ప్రవీణ్, గ్రామ అధ్యక్షుడు నర్సప్ప, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply