75 complaints | ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తాం..
- జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్
75 complaints | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణే ప్రజల నుంచి 75 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడారు. ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదులలో కొన్ని…
…ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో పనిచేశాను. నాకు ఇంతవరకు జీతం ఇవ్వకపోగా కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య అనుచితంగా అమర్యాదగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.నాకు న్యాయం చేయండని పి.మల్లికార్జునయ్య జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
…నేను ఏఎన్ఎం గా పనిచేయుచున్నాను. నాకు బాలుగ్రం అనే వ్యక్తిగా 2019లో వివాహం జరిగింది. నాతో వివిధ ప్రవేట్ బ్యాంకులలో 30 లక్షలకు పైగా లోన్లు తీసుకుని నాతో సంతకాలు పెట్టించి నా జీతం నుండి ప్రతినెలా 28 వెల రూపాయలు ఈఎంఐ కట్టేలా చేసి.. వేరే అమ్మాయిలతో తిరుగుతూ నన్ను మోసం చేస్తున్నాడు. ఆ డబ్బులు నన్ను కట్టమని శారీరకంగా మానసికంగా ప్రతిరోజు నన్ను వేధిస్తున్నాడు. నాకు న్యాయం చేయండని ఓ బాధితురాలు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
…నాకు సంబంధించిన స్థలంలో గడ్డివాము, బర్రెల కొట్టం వేసి శ్రీనివాసులు, నరసింహుడు, వెంకటేశ్వర్లు అనేవారు ఆక్రమించుకోవడం జరిగింది. తీసేయాలని చెప్పగా పట్టించుకోవడం లేదు. నాపై దయవుంచి నాకు న్యాయం చేయండని బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
..నేను వృద్ధుడను.. నాకు ఏ ఆధారము లేదు. నాకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు, కోడలు నా భార్యకు సంబంధించిన ఐదు తులాల బంగారం ఇవ్వడం లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకొని బంగారం ఇప్పించి న్యాయం చేయాలని నూనెపల్లె సాదిక్ నగర్ కు చెందిన బాదుల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

