Tree | నాలుగు నెలలుగా తొలగించని చెట్టు..

Tree | నాలుగు నెలలుగా తొలగించని చెట్టు..
- విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
- ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు
Tree | నెన్నెల, ఆంధ్రప్రభ : కరెంట్ తీగలపై చెట్టు పడిపోయి నాలుగు నెలలు గడుస్తున్నా.. తొలగించడంలో విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ స్తంభం కిందకు ఒరిగి ప్రమాదకర స్థితిలో ఉన్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో భీమారం నుంచి నెన్నెల మండలం వరకు విద్యుత్ సరఫరా ఉండగా, నెన్నెల సబ్స్టేషన్ ఏర్పాటు అనంతరం చిత్తాపూర్ వరకు కొనసాగించారు. అనంతరం అవుడం విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటయ్యాక చిత్తాపూర్ నుంచి జోగాపూర్ వరకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఆగస్టు వర్షాకాలంలో వచ్చిన ఘాటు దుమారాలకు కరెంటు తీగలపై భారీ చెట్టు పడిపోవడంతో తీగలు పూర్తిగా కిందికి వచ్చాయని, దాని ప్రభావంతో ఒక కరెంటు స్తంభం కూడా ఒరిగిపోయి పడిపోయే ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు.

మత్తడి వాగు సమీపంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందని, ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా చిత్తాపూర్ నుంచి జోగాపూర్ వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వ్యవసాయ పనులు, గృహ అవసరాలు పూర్తిగా స్థంభించిపోయాయని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి కరెంటు స్తంభం, తీగలను మరమ్మతులు చేసి ప్రమాదం నుంచి గ్రామాన్ని కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలో కరెంటు తీగలు చోరీకి గురయ్యే అవకాశం కూడా ఉందని, అలా జరిగితే ప్రభుత్వానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
