20lakhs grant | ప్ర‌యోగాల‌తో పాఠాలు..

20lakhs grant | ప్ర‌యోగాల‌తో పాఠాలు..

  • పుస్తకాల చదువుకు బ్రేక్… ప్రయోగాల విద్యకు గ్రీన్ సిగ్నల్
  • అటల్ టింకరింగ్ ల్యాబ్‌తో పాఠశాలల్లో ఆవిష్కరణల యుగం
  • ప్రతి పాఠశాలలో ఆధునిక ల్యాబ్ ఏర్పాటే ప్రభుత్వ ధ్యేయం
  • రూ. 20 లక్షలు గ్రాండ్ గా ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం
  • ఆసక్తి చూపని ప్రభుత్వ బడుల ప్రధానోపాధ్యాయులు

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు : విద్యార్థుల్లో (Students) ఆవిష్కరణ, సృజనాత్మకత, సమస్య పరిష్కార దృక్పథానికి బలమైన పునాది వేయడానికి కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్ అనే పథకాన్ని అమలు చేస్తుంది. ల్యాబ్ ఏర్పాటు కోసం పాఠశాలలకు మొత్తం 20 లక్షలను గ్రాంట్ గా అందజేస్తుంది. సైన్స్, సాంకేతిక విజ్ఞానం, ఇంజినీరింగ్, గణితంపై ప్రాక్టికల్ అవగాహన కోసం, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, 3డీ ముద్రణ వంటి భవిష్యత్ నైపుణ్యాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ల్యాబ్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రైవేటు పాఠశాలల యజమాని చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆధునిక సాంకేతిక వ్యాధులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వ బడులలోని ప్రధానోపాధ్యాయులు ముందుకు రావడం లేదు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఎంత ఉదారంగా అమలు చేస్తున్న ఈ పథకం ప్రయోజనాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందే అవకాశాలను జారవిడుచుకుంటున్నారు.

20lakhs grant | అటల్ టింకరింగ్ ల్యాబ్…

దేశ భవిష్యత్తు తరాలను శాస్త్రీయ దృక్పథంతో తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే అటల్ టింకరింగ్ ల్యాబ్. భారత ప్రభుత్వ అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో భాగంగా రూపొందిన ఈ పథకం, పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ సంస్కృతిని పెంపొందించడమే ప్రధాన ఉద్దేశంగా ముందుకు సాగుతోంది. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (Atal innovation Mission) ద్వారా అమలవుతున్న ఈ కార్యక్రమం, పుస్తకాలకు పరిమితమైన సంప్రదాయ విద్యకు భిన్నంగా ప్రయోగాత్మక విద్యకు పెద్దపీట వేస్తోంది. అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది సాధారణంగా ఒక గది కాదు. విద్యార్థి ఆలోచనలకు రూపమిచ్చే ప్రయోగశాల. ఇక్కడ విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలు చదవడం మాత్రమే కాదు, స్వయంగా ప్రయోగాలు చేసి నేర్చుకుంటారు. చేతితో చేసి చూడటం ద్వారా నేర్చుకునే విధానం వల్ల పిల్లల్లో ఉత్సుకత పెరుగుతుంది. ఎందుకు అనే ప్రశ్నతో పాటు ఎలా అనే ఆలోచన కూడా బలపడుతుంది. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలు రూపొందించే దిశగా విద్యార్థులు ఆలోచించడం మొదలుపెడతారు.

20lakhs grant
20lakhs grant

20lakhs grant| ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్ లు

ఈ ల్యాబ్‌లలో సైన్స్, సాంకేతిక విజ్ఞానం, ఇంజినీరింగ్, గణితం వంటి అంశాలను సులభంగా అర్థం చేసుకునేలా పరికరాలు అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ పరికరాలు, రోబోటిక్స్ కిట్లు, ఓపెన్ సోర్స్ మైక్రోకంట్రోలర్ బోర్డులు, వివిధ రకాల సెన్సార్లు, 3డీ ముద్రణ యంత్రాలు, కంప్యూటర్ ఆధారిత స్వయంగా తయారు చేసుకునే కిట్లు విద్యార్థులకు (Students) ఇవ్వబడతాయి. వీటి ద్వారా ఒక ఆలోచన ఎలా రూపుదిద్దుకుంటుందో ప్రత్యక్షంగా చూడగలుగుతారు. భవిష్యత్తు ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాల వైపు కూడా అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు దారిచూపుతున్నాయి. రూపకల్పన దృక్పథం, గణనాత్మక ఆలోచన, అనుకూలంగా నేర్చుకునే సామర్థ్యం వంటి అంశాలు సహజంగానే అలవడతాయి. రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, 3డీ ముద్రణ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్న వయసులోనే పరిచయం కావడం వల్ల విద్యార్థుల్లో భవిష్యత్తు పట్ల ధైర్యం పెరుగుతోంది. నిధుల మద్దతు విషయంలో ఈ పథకం మరింత బలంగా ఉంది. ఎంపికైన పాఠశాలలకు ల్యాబ్ ఏర్పాటు కోసం ఒకేసారి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తారు. ఆపై నిర్వహణ ఖర్చుల కోసం 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 2 లక్షల చొప్పున మరో 10 లక్షలు అందిస్తారు. మొత్తం మీద 20 లక్షల రూపాయల గ్రాంట్‌తో పాఠశాలలో ఆధునిక టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండా పూర్తిగా ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా ఎంపిక జరుగుతుంది.

20lakhs grant
20lakhs grant

20lakhs grant| ప్రభుత్వ బడులలో స్పందన కరువు

దేశవ్యాప్తంగా ఈ ల్యాబ్‌లు (Lab) ఇప్పటికే అనేక మంది విద్యార్థుల్లో ఆవిష్కరణ తత్వాన్ని వెలికి తీస్తున్నాయి. అయితే జిల్లాల స్థాయిలో చూస్తే, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా తగిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. ప్రైవేటు పాఠశాలలు ముందంజలో ఉండగా, ప్రభుత్వ బడులు వెనుకబడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఇది కొనసాగితే ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులు ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. రాయలసీమ వంటి ప్రాంతాల్లో విద్యే జీవనాధారం.

ఇక్కడి విద్యార్థులకు అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తే వారి సృజనాత్మకత, ఆలోచనా శక్తి కొత్త దిశలో వికసిస్తుంది. జిల్లా విద్యాశాఖ, సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఈ పథకాన్ని ప్రోత్సహిస్తే ప్రతి పాఠశాలలో ఒక అద్భుతమైన ప్రయోగశాల ఏర్పడుతుంది. అప్పుడు పుస్తకాలలోని శాస్త్రం ప్రయోగాల్లో కనిపించే స్థాయికి చేరుతుంది. పుస్తకాల్లో చదివిన శాస్త్రం ప్రయోగాల్లో కనిపించిన రోజే నిజమైన విద్య మొదలవుతుంది. ఆ దిశగా దేశాన్ని నడిపించే శక్తిగా అటల్ టింకరింగ్ ల్యాబ్ నిలుస్తోంది. అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు కేవలం ఒక పథకం కాదు… రేపటి భారతదేశానికి బాటలు వేసే ఆలోచనల కేంద్రం. ఇప్పటికైనా ప్రభుత్వ బడులు మేల్కొని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే, రేపటి రాయలసీమ పిల్లలే దేశానికి దారి చూపించే ఆవిష్కర్తలుగా ఎదగడం ఖాయం.

CLICK HERE TO READ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు..

CLICK HERE TO READ MORE

ఇక్కడి విద్యార్థులకు అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తే వారి సృజనాత్మకత, ఆలోచనా శక్తి కొత్త దిశలో వికసిస్తుంది. జిల్లా విద్యాశాఖ, సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఈ పథకాన్ని ప్రోత్సహిస్తే ప్రతి పాఠశాలలో ఒక అద్భుతమైన ప్రయోగశాల ఏర్పడుతుంది. అప్పుడు పుస్తకాలలోని శాస్త్రం ప్రయోగాల్లో కనిపించే స్థాయికి చేరుతుంది. పుస్తకాల్లో చదివిన శాస్త్రం ప్రయోగాల్లో కనిపించిన రోజే నిజమైన విద్య మొదలవుతుంది. ఆ దిశగా దేశాన్ని నడిపించే శక్తిగా అటల్ టింకరింగ్ ల్యాబ్ నిలుస్తోంది. అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు కేవలం ఒక పథకం కాదు… రేపటి

Leave a Reply