Pulse polio | నిండు జీవితానికి రక్ష

Pulse polio | నిండు జీవితానికి రక్ష
- పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయించండి
- జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
Pulse polio | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ : రెండు పోలియో చుక్కలు వేయించండి.. నిండు జీవితాన్ని నిలపండి అని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా గుంటూరు పట్టణం శ్రీనివాసతోట యూపీహెచ్‌సీ కేంద్రంలో ఆదివారం చిన్నారులకు కలెక్టర్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేల్లలోపు వయసు ఉన్న ప్రతి చిన్నారికి రెండు పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. రెండు చుక్కలు నిండు జీవితాన్ని కాపాడుతుందని, అంగ వైకల్యం నుంచి దూరంగా ఉంచుతుందని చెప్పారు. చిన్నారులకు అంగవైకల్యం ప్రాప్తిస్తే జీవితాంతం ఆ వ్యక్తి, కుటుంబం బాధపడాలన్నారు. మానసికంగా క్షోభను అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకోసం చిన్నారులకు సమయానుసారం ఇమ్యునైజేషన్ చేయించాలని కోరారు.

జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించుటకు 958 పోలియో బూత్‌లు, 16 ట్రాన్సిట్ పాయింట్లు, 6 బఫర్ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఐదేళ్లలోపు వయసు గల పిల్లలు 2,14,981 మంది ఉన్నారని తెలిపారు. 2,57,980 డోసులు, 12,899 వాయల్స్ సిద్ధం చేశామని వివరించారు. 784 రిస్క్ ప్రాంతాలు గుర్తించామని, 104 రూట్‌లు, 72 మొబైల్ టీమ్‌లు, 4,090 వ్యాక్సినేటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. మొత్తం 4,406 మంది వైద్య, విద్యాశాఖ సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారని చెప్పారు. పోలియో చుక్కలు వేసిన తరువాత మూడు రోజులు ఇంటింటి పర్యవేక్షణ చేసి పిల్లలను గుర్తించి చుక్కలు వేయని వేయడం జరుగుతుందని, గుంటూరు పట్టణంలో నాలుగవ రోజు కూడా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె.విజయలక్ష్మి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఏ. శ్రావణ బాబు పాల్గొన్నారు.

