హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐఐటీఏ)లో నేడు 24వ బ్యాచ్ కెనైన్స్ (డాగ్ స్క్వాడ్) పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్‌కు ముఖ్యఅతిథిగా ఇంటలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. డీజీకి ఓ జాగిలం పూలబొకే ఇచ్చి స్వాగతం పలికి సెల్యూట్ చేసింది. అనంతరం డీజీ జాగిలాలను పరిశీలించి.. గౌరవ వందనం స్వీకరించారు.
ఐఐటీఏలో 24వ బ్యాచ్ కెనైన్స్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో 72 జాగిలాలు పాల్గొన్నాయి. ఈ 72 జాగిలాలకు 101 మంది హ్యాండ్లర్స్ శిక్షణ ఇచ్చారు. ఐఐటీఏలో లెబ్రడాల్, జర్మన్ షపర్డ్, ఆల్సీషియన్, గోల్డెన్ రిట్రీవర్, డాబర్‌మెన్, డాల్మేషన్ జాతులకు చెందిన జాగిలాలకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 256 జాగిలాలు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సేవలు అందిస్తున్నాయి. ఇందులో సుమారు 120 జాగిలాలు డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను గుర్తించేందుకు శిక్షణ తీసుకున్నాయి.