Maoist letter | నిరాయుధుల అరెస్ట్ అక్రమం..
తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ లేఖ
16మంది మావోయిస్టుల అరెస్టును ఖండిస్తూ లేఖ
Maoist letter | ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) లో నిన్న 16 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టులపై మావోయిస్టు పార్టీ స్పందిస్తూ.. కీలక లేఖను విడుదల చేసింది. జగన్ పేరుతో విడుదలైన ఈ లేఖలో.. పార్టీ కార్యకర్తల అరెస్టును భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ (Telangana State Committee) తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సిర్పూర్ (యు) మండలంలోని కకర్ బుడ్డి, బాబ్జీ పేట గ్రామాల పరిసరాల్లో నిరాయుధులుగా ఉన్న తమ సహచరులను, గ్రామస్తులతో కలిపి మొత్తం 16 మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని పార్టీ అధికార ప్రతినిధి జగన్ (Official spokesperson Jagan) పేరుతో వచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడానికే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన వారందరినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ (demand) చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP government) కార్పొరేట్ ప్రయోజనాల కోసం, విపక్షాలు లేని దేశాన్ని నిర్మించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని లేఖలో విమర్శించారు. ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ఇతర రాజకీయ పార్టీలు ఈ అక్రమ అరెస్టులను ఖండించాలని, తెలంగాణలో శాంతియుత వాతావరణం కొనసాగేలా మద్దతు తెలపాలని పార్టీ విజ్ఞప్తి చేసింది.

