AP | జ‌గ‌న్ అర్థిక ఆరాచ‌కం హిరోషిమా అణుదాడితో స‌మానం – ప‌య్యావుల

వెల‌గ‌పూడి – వైసిపి అయిదేళ్ల పాల‌న‌లో జ‌రిగిన అర్థిక ఆరాచ‌కాన్ని హీరోషిమాపై జ‌రిగిన అణుబాంబు దాడితో పోల్చారు ఎపి అర్థిక మంత్రి ప‌య్యావులు కేశవ్ .. 2025-26 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, గత ప్రభుత్వ తప్పిదాలను, నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు. “తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో.. ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరి చేస్తున్నాం. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరపకపోవడంతో అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ముందుకు రాలేదు.” అని అన్నారు.

చంద్రబాబు ఇవాళ ఆలోచించేదే.. రేపు దేశం ఆలోచిస్తుంది..
అలాగే ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తెచ్చినప్పటి పరిస్థితులను బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల గుర్తు చేసుకున్నారు. డ్రిప్ ఇరిగేషనుపై అధ్యయనానికి ఇజ్రాయెల్ వెళ్లిన బృందంలో తానూ సభ్యుడిగా ఉన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబుకు గుర్తు చేశారు. “దేశంలో తొలిసారిగా ఉమ్మడి ఏపీలోనే డ్రిప్ ఇరిగేషన్ పైలెట్ ప్రాజక్టును అమలు చేశాం. జాతీయ స్థాయిలో డ్రిప్ ఇరిగేషనుపై వేసిన టాస్క్ ఫోర్సుకు చంద్రబాబే ఛైర్మనుగా ఉన్నారు. చంద్రబాబు ఇవాళ ఏం ఆలోచిస్తారో.. రేపు దేశం అదే ఆలోచిస్తుందనడానికి డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టే నిదర్శనం. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ లేని రాష్ట్రం లేదు, డ్రిప్ ఇరిగేషన్ లేని పొలం లేదు. ఇలాంటి కీలకమైన డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.” అని వెల్లడించారు.

పవన్‌ కళ్యాణ్‌ మార్గదర్శకత్వంలో..
ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ గురించి కూడా ప్రస్తావించారు. మంత్రి మాట్లాడుతూ.. “ పవన్‌ కళ్యాణ్‌ మార్గదర్శకత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తున్నాం. నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటను ఎంచుకున్నారు. తమను తాము కాపాడుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని మరువలేం. రాజధాని పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజనులా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. రాజధాని అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని నిరూపితమైంది. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్టు నుంచి రూపాయి కూడా కేటాయించడం లేదు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌, హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతికి నిధులు సమకూరాయి.” అని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రగతికి పరుగులు పెట్టించే బడ్జెట్ ..

 రాష్ట్ర ప్రగతికి పరుగులు పెట్టించేలా వివిధ విధాన నిర్ణయాలు ఉన్నాయని బడ్జెట్ప్ర సంగంలో వెల్లడించారు. విద్యా, మున్సిపాలిటీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు తీసుకున్నామని. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు.

మున్సిపాలిటీలకు స్వేచ్ఛ

ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందించడంతో స్థానిక సంస్థలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుందన్నారు. కేంద్రీకృత బిల్లుల చెల్లింపుల విధానం నుంచి మున్సిపాలిటీలకు విముక్తి కల్పించనున్నట్లు తెలిపారు. 2024 ఏప్రిల్ నెల నుంచి తమ బిల్లులను తామే చెల్లింపులు జరుపుకునేలా మున్సిపాలిటీలకు స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపాలిటీలకు చిన్నపాటి పనులకు బిల్లుల చెల్లింపులను ఆ శాఖ సెక్రటరీ ఆమోదం తెలిపే విధానాన్ని గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దానికి స్వస్తి పలుకుతూ తమ బిల్లుకు తామే చెల్లింపులు జరుపుకునేలా మున్సిపాలిటీలకు స్వేచ్ఛనిచ్చింది కూటమి ప్రభుత్వం.

తొలిసారి తెలుగు భాషకు..

క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్ ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిచనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రొత్సాహకంగా ప్రాజెక్టులో 20 శాతం మేర వయబులిటి గ్యాప్ ఫండింగ్ ఇచ్చేలా కూటమి ప్రభుత్వం స్కీం డిజైన్ చేసిందన్నారు. ప్రాజెక్టుల గ్యాప్ ఫండింగ్ స్కీం కోసం రూ. 2 వేల కోట్లతో కార్పస్ ఫండ్ కేటాయించడం జరిగింది. తెలుగు భాషాభివృద్ధికి రూ. 10 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. తొలిసారిగా తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. తెలుగు భాషకు తామిచ్చే ప్రాధాన్యతను తెలియచెప్పేలా నిధుల కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.

మద్యం వినియోగం తగ్గేలా…

మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచారం కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు జరిగాయి. నవోదయం 2.0 స్కీం కింద మద్యపాన, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం కోసం నిధులు కేటాయిస్తున్నట్లు పయ్యావుల తెలిపారు. మద్యంపై వచ్చే ఆదాయమే ధ్యేయంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని.. మద్యపాన వినియోగం తగ్గించేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. కాలుష్యరహిత ఆంధ్రగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేపడుతున్నట్టు బడ్జెట్‌లో ప్రస్తావించారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని, జీరో కాలుష్యం ఉండేలా ప్రణాళికలు రూపకల్పనపై బడ్జెట్‌లో మంత్రి ప్రస్తావించారు.

పెద్ద ఎత్తున నిధులు..

వివిధ అభివృద్ధి పథకాలకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది. డ్రిప్ ఇరిగేషన్‌కు బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. 85 వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చేందుకు అనుమతులు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 95.44 లక్షల ఇళ్లకు రక్షిత తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు మంత్రి. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పశువుల పాకలు వంటి 30 వేల పనులను ఇప్పటికే మంజూరు చేసినట్టు బడ్జెట్‌లో వెల్లడించారు. 4,300 కిలోమీటర్ల మేరకు మంజూరైన సి.సి.రోడ్లల్లో, ఇప్పటికే 3 వేల కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తైనట్టు స్పష్టీకరించారు. మిగిలిన 1300 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం తుది దశలో ఉన్నట్టు బడ్జెట్‌లో ప్రస్తావించారు.

రాయలసీమకు నీరు…

నరేగా ద్వారా 72 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. పోలవరం-బనకచర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 200 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించేలా పనులు చేపట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే హంద్రీ-నీవా ప్రాజెక్టు కాల్వల వెడల్పు చేసే పనులు ప్రారంభమైనట్టు బడ్జెట్‌లో స్పష్టీకరించారు. పాట్‌హోల్‌ ఫ్రీ ఆంధ్ర నినాదంతో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. మరమ్మత్తులు చేపట్టిన 20,059 కిలోమీటర్లలో, 17,605 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు మూడు నెలల వ్యవధిలోనే పూర్తి చేసినట్టు బడ్జెట్‌లో మంత్రి ప్రస్తావించారు.

2027 నాటికి పోలవరం పూర్తి..

గత ప్రభుత్వంలో కొట్టుకుపోయిన వివిధ డ్యాముల అంశాన్ని కూడా మంత్రి పయ్యావుల ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టునే కాదు.. పల్లెల్లో పిల్ల కాల్వలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. డ్యాములు కొట్టుకుపోయినా కన్నెత్తి చూడని గత పాలకుడిని చూశామని.. పొరుగు రాష్ట్రంలో గేట్లు కొట్టుకుపోతే పరుగులు పెట్టించిన నేటి పాలకుడిని చూస్తున్నామన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు.

అయ్యన్న వ్యాఖ్యలను గుర్తు చేస్తూ..

స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపక్షంగా ఉండగా చేసిన చెత్త ప్రభుత్వం వ్యాఖ్యలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. గతంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెత్త పన్ను వేసిన గత పాలకులపై చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయన్నారు. అప్పులనే కాదు.. చెత్తను వారసత్వంగా ఇచ్చింది గత ప్రభుత్వమంటూ మండిపడ్డారు. చెత్త పన్ను వేయడమే కాకుండా.. 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్తకుండానే వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయిందంటూ మంత్రి పయ్యావుల వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *