Achampeta | కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలి

Achampeta | అచ్చంపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంతోనే గ్రామాల సుస్థిర అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని టీపీసీసీ ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం అచ్చంపేట మండలంలోని రంగాపూర్ దర్గా తండా, చందాపూర్, నడింపల్లి గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, పది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల వ్యవధిలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుపేదలకు నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలతో పాటు మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలిస్తే రంగాపూర్ దర్గా తండా గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, పశువుల దవాఖానా, క్రికెట్ గ్రౌండ్, ప్రధాన రహదారిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఉమామహేశ్వరం దర్గాల అభివృద్ధి, పారిశుద్ధ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

గతంలో రంగాపూర్ గ్రామానికి వందలాది ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. రంగాపూర్ దర్గా తండాలో నేనావత్ శివ నాయక్ (బ్యాట్ గుర్తు), చందాపూర్‌లో నామని లక్ష్మమ్మ (కత్తెర గుర్తు), నడింపల్లిలో రాగిపాని తేజశ్రీ (టూత్‌పేస్ట్ గుర్తు)లకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వర ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు లచ్చు నాయక్, లోక్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply