అనంతపురంలోని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఓ కేసుకు సంబంధించి గోరంట్ల మాధవ్‌కు నోటీసులిచ్చేందుకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు గోరంట్ల మాధవ్ ఇంటికి వచ్చారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 35/3 కింద మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు మార్చి 5న హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
కాగా, ఒక ఇంటర్వ్యూలో పోక్సో బాధితురాలి పేరును గోరంట్ల మాధవ్ బయటపెట్టాడని కేసు నమోదైంది. మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు మాధవ్‌కు నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు.
అయితే, గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు రావడంతో ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారంజరగడంతో పెద్దయెత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడకు తరలి వచ్చారు. అయితే తాము నోటీసులు ఇవ్వడానికే వచ్చామని పోలీసులు తెలిపారు.