Sri Sathya Sai | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా నల్లచెరువు మండలం దేవీరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకుడు ధనంజయ అలియాస్ షేక్ మహమ్మద్ అసిఫ్ సోషల్ మీడియాలో పాకిస్తాన్‌కు అనుకూలంగా వీడియోలు పోస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. కొన్నేళ్ల క్రితం హిందూ మతం నుంచి ఇస్లాం మతాన్ని స్వీకరించిన అతడు, ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ వీడియోలు షేర్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై మండలానికి చెందిన కొంతమంది యువకులు నల్లచెరువు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ, గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడని వారు ఆరోపించారు. గతంలో కూడా ఇలాంటి ప్రవర్తనకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ధనంజయ అలియాస్ షేక్ మహమ్మద్ అసిఫ్ పై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల యువకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం పై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.


