అక్రమ సొమ్ము, అధర్మం వైపు రాజగోపాల్ రెడ్డి ఉండడు..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: డబ్బు, మద్యం ఇచ్చే అభ్యర్థుల కన్నా ఐదు సంవత్సరాలు నిజాయితీగా పని చేసే అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటర్లను కోరారు.
మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం, కొయ్యలగూడెం, డి నాగారం, చిన్నకొండూరు, నేలపట్ల, జై కేసారం, ఎస్ లింగోటం, పంతంగి తదితర గ్రామాల్లో ఎన్నికల సభలను నిర్వహించారు.
గత 10 సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి వేల కోట్లు దోచుకున్నారని, స్థానిక బిఆర్ఎస్ నాయకులు డబ్బు తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయమని ప్రజలను ప్రేరేపిస్తారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
మల్కాపురంలో భూకబ్జాలకు పాల్పడే వ్యక్తులకు బుద్ధి చెప్పి, ధర్మం వైపు ఉన్న ఈడుదుల మస్తాన్ బాబు ను సర్పంచ్ గా గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు సంవత్సరాలు కొనసాగుతుందని, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, స్వర్ణ బియ్యం వంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు.
రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని, రాజకీయాల్లో తన లక్ష్యం నిజాయితీగా ప్రజా సేవ చేయడమే అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
