Security | సాంకేతిక నిఘా..
- భవానీ దీక్షల విరమణకు గట్టి బందోబస్తు
- ఏఐ డ్రోన్, సీసీ కెమెరాలతో రద్దీ పర్యవేక్షణ
- ఫేసియల్ రికగ్నిషన్‌తో పాత నేరస్థుల కదలికల గుర్తింపు
- కమిషనర్ ఎస్వి. రాజశేఖర్ బాబు ప్రత్యక్షంగా ఏర్పాట్ల పరిశీలన
Security | విజయవాడ, క్రైమ్ ఆంధ్రప్రభ : భవాని దీక్షలు విరమణ నేపథ్యంలో నగర పోలీసులు ఆధునిక సాంకేతికతను కేంద్రంగా చేసుకుని పటిష్టమైన బందోబస్త్ అమలు చేస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజ శేఖర బాబు ఆధ్వర్యంలో ఏఐ డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, ఫేసియల్ రికగ్నైజెషన్ పరికరాలతో దీక్షల విరమణ ప్రాంగణాన్ని క్రమంగా పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ఇతర ఉన్నత పోలీసు అధికారులతో కలిసి భవానీ దీక్షా విరమణ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. మోడల్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి స్నానఘాట్లు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాలు, కేశఖండనశాలలు, హోల్డింగ్ ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు.

ట్రాఫిక్ వ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డిసిపి షిరీన్ బేగం కు పలు సూచనలు చేశారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్‌ను నిశితంగా పర్యవేక్షిస్తూ భవానీలు వాహనాలను నిర్ణీత ప్రదేశాల్లోనే పార్క్ చేసుకునేలా సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు.ఏఐ డ్రోన్ కెమెరాల ద్వారా గిరిప్రదక్షిణ ప్రాంతాల్లోని రద్దీని పర్యవేక్షించి అధికారులకు సూచనలు చేశారు. దేవాలయ పరిసరాల్లో పాత నేరస్థుల కదలికలను గుర్తించేందుకు ఫేసియల్ రికగ్నైజెషన్ వ్యవస్థలను అమర్చి, గుర్తించిన వెంటనే సంబంధిత క్రైమ్ సిబ్బందికి సమాచారం అందే విధంగా చర్యలు తీసుకున్నారు.

భక్తుల దర్శన సమయం ఎంతగా సాగుతోంది అనే దానిపై ఎప్పటికప్పుడు అంచనాలు తెలుసుకునే విధంగా సచివాలయ మహిళా పోలీసులకు ప్రత్యేక సూచనలు చేశారు. అనంతరం హోమగుండాలు, విరుముడి స్టాల్స్, ప్రసాదం కౌంటర్లను పరిశీలించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ ఎస్వి. రాజశేఖర బాబు, డీసీపీలు లక్ష్మీనారాయణ, షిరీన్ బేగం, కృష్ణ ప్రసన్న, ఆనంద్ బాబు, ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇలక్కియా పాటు ఇతర అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

