హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : భారతదేశంలోని ప్రముఖ డ్రోన్ కంపెనీ గరుడ ఏరోస్పేస్, తెలంగాణలోని నాగర్ కర్నూల్ లోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్ బీసీ) టన్నెల్ కూలిపోవడంతో జరుగుతున్న కీలకమైన రెస్క్యూ ఆపరేషన్ లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్ డీఆర్ఎఫ్) కు మద్దతుగా తమ కన్స్యూమర్ డ్రోన్, ద్రోణిని మోహరించింది.
అధిక మొత్తంలో నీరు, బురద చేరుకోవటం కారణంగా రెస్క్యూ ప్రయత్నం తీవ్ర అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఇది చాలా పరిమిత దృశ్యమానతతో ప్రమాదకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. గరుడ ఏరోస్పేస్ డ్రోన్లను మ్యాపింగ్, వ్యూహాత్మక రెస్క్యూ ప్లానింగ్ కోసం ఉపయోగిస్తున్నారు.
ఈ సందర్భంగా గరుడ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు, సీఈఓ అగ్నిశ్వర్ జయప్రకాష్ ఎన్ డీఆర్ఎఫ్ కు మద్దతు ఇవ్వడం పట్ల మాట్లాడుతూ… తమ డ్రోన్లు సవాలుతో కూడిన వాతావరణంలో కీలకమైన డేటాను అందించడానికి రూపొందించబడ్డాయన్నారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ఎన్ డీఆర్ఎఫ్ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. తాము ఎన్ డీఆర్ఎఫ్ తో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి కాదని, విపత్తు ప్రతిస్పందన కార్యకలాపాల్లో తమ డ్రోన్లు నిరంతరం తమ సామర్థ్యాలను నిరూపించుకున్నాయన్నారు.