మెస్సి తో మ్యాచ్‌కు ఉప్పల్ రెడీ…

- భద్రతపై ప్రత్యేక దృష్టి
- డిజిపి సమగ్ర సమీక్ష
- ట్రాఫిక్, సదుపాయాలపై విస్తృత ఏర్పాట్లు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో ఈ నెల 13న లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి పాల్గొనే ఫుట్‌బాల్ మ్యాచ్ ఏర్పాట్లపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీ. శివధర్ రెడ్డి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ మ్యాచ్‌కు సంబంధించిన సమగ్ర ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. సమావేశానికి జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ, వాటర్ వర్క్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ శాఖల అధికారులు, అలాగే మ్యాచ్ నిర్వాహకులు హాజరై తమ శాఖల చర్యలను డిజిపికి వివరించారు.
ప్రపంచ వ్యాప్త ఇమేజ్ ఉన్న మెస్సి పాల్గొనడం, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవడం దృష్ట్యా భద్రతాపరమైన ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉండాలని డిజిపి బీ. శివధర్ రెడ్డి ఆదేశించారు.
మ్యాచ్‌కు తరలివచ్చే ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఇందుకోసం మెట్రో రైళ్లలో, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసే ప్రచార బోర్డుల ద్వారా ట్రాఫిక్ మళ్లింపు వివరాలు, అవసరమైన సూచనలను ప్రజలకు ముందుగానే తెలియజేయాలని అధికారులు పేర్కొన్నారు.
స్టేడియంను సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్—మొత్తం నాలుగు ప్రధాన సెక్టర్లుగా విభజించినట్లు, సుమారు 39 వేల మంది కూర్చునే సామర్థ్యం ఉందని అధికారులు వివరించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ అంతర్జాతీయ మ్యాచ్‌ను ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని డిజిపి సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో శాంతిభద్రతల అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

