ఎన్నికల వేళ కఠిన నిఘా..

  • మద్యం–డబ్బుల పంపిణీకి చెక్!
  • భీమ్‌గల్ సరిహద్దుల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ ఫుల్ యాక్షన్!

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో భీమ్‌గల్ పట్టణంలోని ముచ్కూర్ ఎక్స్‌ రోడ్‌ సహా దేవక్కపేట్–తాళ్లపల్లి సరిహద్దుల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు గురువారం మద్యం, డబ్బుల పంపిణీని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాహనాలను నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

ఎన్నికల నిబంధనలు పాటించాలని వాహనదారులకు అధికారులు సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎటువంటి ఉపేక్ష లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి అశ్విన్ బాబు స్పష్టం చేశారు.

రూ. 50 వేలకుపైగా నగదు తీసుకెళ్లాల్సి వస్తే, సంబంధిత రసీదులు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, లేకపోతే నగదును స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. మద్యం అక్రమ రవాణాపై పటిష్ట నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఎవరు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా సమాచారం ఇస్తే, వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. వివరాలు తెలియజేసిన వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులైన పురస్తు నరేష్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గన్నారం శ్రీనివాస్, వీడియో గ్రాఫర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply