Orders Issue | ఇరువురిపై జిల్లా బహిష్కరణ
- ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
Orders Issue | కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో షరీన్ నగర్‌లో నివాసముండే కిరాయి హంతకుడు వడ్డే రామాంజనేయులు, సస్పెక్ట్ షీటర్ 216 పఠాన్ ఇమ్రాన్ ఖాన్‌లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అలవాటు పడిన వీరిని జిల్లా నుంచి బహిష్కరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఉత్తర్వులను జారీ చేశారు. రామాంజనేయులుపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 17కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి.
అందులో హత్యలు, దోపిడీలు, ఎస్సీ ఎస్టీ వర్గాల మీద దాడులు, జులుం కేసులు, హత్యాయత్నం ఇలా పలు రకాల కేసులు నమోదై ఉన్నాయి. అదే విధంగా మరొక వ్యక్తి అయిన పఠాన్ ఇమ్రాన్ ఖాన్ మీద కూడా సుమారు 19 క్రిమినల్ కేసులున్నాయి. పలుమార్లు వీరిపై తెలిపిన కేసుల్లో రిమాండ్‌కు వెళ్లినా, 2022లో వీరిద్దరూ కూడా PD act నిర్భంద ఉత్తర్వుల కింద కడప సెంట్రల్ జైల్లో ఖైదు చేయబడినప్పటికీ వీరి ప్రవర్తనలో మార్పు రాకపోగా, తదుపరి కూడా రకరకాల కేసులలో పాల్గొంటున్నారని కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రతిపాదనల మేరకు వారి ఇద్దరిపై గురువారం బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ…
జిల్లాలో ఇప్పటినుండి ఎవరైనా రౌడీయిజంతో అరాచక శక్తులుగా మారి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలుగజేసే విధంగా ప్రవర్తిస్తే జిల్లా బహిష్కరణతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలిస్తామని హెచ్చరించారు. మరికొందరు జిల్లా బహిష్కరణ గురించి పరిశీలనలో ఉన్నారని ఎస్పీ తెలిపారు.

