మానవ నాగరికత అభివృద్ధి చెందుతున్న కాలంలో తమకు తామే రూపొందించుకున్న నైతికవర్తనకు సంబంధించిన కొన్ని నియమాల ననుసరించి సమాజం ముందుకు సాగుతుంది. అంతర్గతంగా మానవునిలో దాగివున్న దివ్యత్వాన్ని ఆవిష్కరించేందుకు ఆ నియమాలు సహాయకారులు అవుతున్నాయి. దార్శనికులైన ఋషుల మార్గదర్శనలో భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక జీవితాల సమన్వయానికి అవే సార్వకాలిక ధర్మాలుగా, సర్వజనీనమై ఆదరణను పొందుతున్నాయి. సరళత, వినయం. నిబద్ధత నైతికవర్తనకు ప్రతీకలుగా చెప్పుకోవచ్చు.
ఆధ్యాత్మికత అనేది రసమయ భౌతిక జీవితాన్ని పూర్తిగా త్యజించి దేవుడనే భావనకు మాత్రమే పరిమిత మవడంకాదు. భౌతిక జీవితాన్ని ఆస్వాదిస్తూ… తానేమిటో, తన మూలాలేమిటో అవగాహన చేసుకోవడమే ఆధ్యాత్మికత. జీవితభాగస్వామి, కుటుంబం, పరివారం, పనిచేయడం, సంపదను సృజించడం, ఫలితాన్ని ఆస్వాదించి ఆనందించడం. ఇవన్నీ ఆధ్యాత్మికతలో భాగమే. భౌతిక జీవితం ప్రగతినివ్వవచ్చు కాని బంధనాలకు కారణమౌతుంది. దానికతీతమైన అంతర్గత ప్రజ్ఞను జాగృతం చేసుకోవడం సుగతినిస్తుంది. ఇనుముకు ఆయస్కాంతశక్తిని ఆపాదించినట్లుగా నైతికవర్తనతో ఆధ్యాత్మికత అనుసంధానింపబడితే ఆత్మవిశ్వాసంతో కూడిన పరిపూర్ణ వ్యక్తిత్వం ఆవిష్కృతమౌతుంది. భౌతిక ఆధ్యాత్మిక జీవితాలలో విజయం లభిస్తుంది.
విద్యకు అవిద్యకు మధ్య చాలాపెద్ద అంతరం ఉంటుంది. విద్య అవిద్యల పరిణామాలు కూడా వేరువేరుగా ఉంటాయి, అంటుంది కఠోపనిషత్తు. విద్య జ్ఞానాన్ని ఇస్తుంది.. అవిద్య అజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానం శాశ్వతము అశాశ్వతమైనవి ఏవో ”యెఱుక” పరుస్తుంది. శ్రేయస్సును ఇస్తుంది. అజ్ఞానం అంటే లోకజ్ఞానం లేకపోవడం కాదు.. తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టకపోవడం. తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి శాశ్వత ప్రయోజనాలను వదులుకోవడం అజ్ఞానం. మానవ జీవితం చేటడంత అయితే తెలుసుకోవలసిన జ్ఞానం ఆకాశమంత.. పాఠశాలలలో గడిపే కొద్ది సమయంలో నేర్చుకునేదే మిగిలిన జీవితమంతా నేర్చుకునేందుకు ప్రాతిపదిక అవుతుంది. ఆ సమయంలో పలకరించే ప్రలోభాలను ఆదరిస్తే సమగ్ర జీవన ప్రయోజనానికి విఘాతం కలుగుతుంది. వివేకవంతుడు సంకుచితత్వాన్ని విడిచి విశ్వజనీన భావనను పెంచుకుంటాడు.
ఒక తత్త్వవేత్తను మరణించిన పిమ్మట ఏమవుతుందని అడిగారట దానికతడు దానిని తెలుసుకోవాలంటే మరణించడ మొక్కటే మార్గం అన్నాడట. నిజమే మరణించడమంటే భౌతికంగా శరీరాన్ని విడవడం కాదు. మానసికంగా, ఆంతరంగికంగా, భావోద్వేగాల పరంగా బా#హ్య జగత్తుపై ఏర్పరుచుకున్న బంధాలను త్యజించ గలగాలి. అలాగని కర్తవ్యాన్ని త్యజించ కూడదు. మనసులో నిలువ జేసుకున్న భారాన్నంతా వదిలించుకుంటే మరణించడమంటే ఏమిటో తెలుస్తుందంటాడా తత్త్వవేత్త. ఎప్పుడైతే మానసికంగా ఆ అనుభవాన్ని పొందుతామో భౌతికంగా సంభవించే మరణాన్ని గూర్చిన భయమూ, భ్రమలూ ఉండవు.
తెలుసుకోవడానికీ, అర్థంచేసుకోవడానికి మధ్యభేదం ఉంటుంది. తెలుసుకోవడ మనేది గతానికి సంబంధించింది కాగా అర్థంచేసుకోవడం నిరంతర ప్రక్రియ. అది వర్తమానానికి సంబంధించినది. గతం ఎప్పుడైనా భారమైనదే.
ఈ ప్రక్రియలో జ్ఞానం కూడా భారమైనదే. గతం వర్తమానం రెండూ కాలానికి సంబంధించిన భావనలు. పరిశీలనకు, పరిశీలనా వస్తువుకు మధ్యనున్న అంతరమే కాలం అంటారు, జిడ్డు కృష్ణమూర్తిగారు. మానసికమైన కాలప్రమాణమే సమయం. ఆలోచనకు, ఆచరణకు మధ్యనున్న విరామమే కాలంగా పరిగణించాలని వారంటారు.
వ్యక్తి విలువలు, ప్రవర్తన, నిర్ణయాలు తీసుకునే విధానం, ఇతరులతో వ్యవహరించే వ్యవహార సరళి ఇవి వ్యక్తియొక్క నైతిక వర్తనకు ప్రతీకలుగా నిలుస్తాయి. అలాగే జీవన ప్రయోజనాన్ని అన్వేషించడం ఆధ్యాత్మికతగా చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికత నైతిక విలువలతో కూడినప్పుడు వ్యక్తికీ సృష్టికి ఉన్న అనుబంధాన్ని అవగా#హన చేసుకోగలుగుతాము. సృష్టి సజావుగా సాగే క్రమంలో మన బాధ్యత ఏమిటో తెలుసుకుంటాము. దయ ప్రేమలాంటివి ఆవిష్కృతమౌతాయి. దానివల్ల వ్యక్తిగత అభివృద్ధి, సామాజిక ప్రగతి నిశ్చితమౌతాయి. ఆత్మ పరిశీలనకు, సహానుభూతికి అద్దంపడతాయి. అ#హంసా, నిజాయతీ, కలివిడి స్వభావం, క్షమాగుణం, దాక్షిణ్యత లాంటివి ఆవిష్కృతమౌతాయి.
మానవ జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు పలకరించవచ్చు.. వాటిని అధిగమించే మానసిక స్థిరత్వం, దృఢత్వం.. నైతికవర్తనతో కూడిన ఆధ్యాత్మిక సాధన వల్ల పెంపొందుతాయి.
- పాలకుర్తి రామమూర్తి