Kona Raghupathi | పోలీస్ స్టేషన్‌లో.. కోన

Kona Raghupathi | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : రాత్రంతా వైసీపీ నాయకులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన పోలీసుల తీరును బాపట్ల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కోన రఘుపతి ఖండించారు. పల్నాడు జిల్లాలో పిన్నెల్లి సోదరులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి తరలి వెళ్లకుండా నియోజకవర్గంలో ఉన్న పలువురు వైసీపీ నాయకులు పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు, బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడు కోకిల రెడ్డి, వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్ల రామయ్యలను పోలీసులు ముందస్తుగా నోటీసులు జారీ చేసి బుధవారం రాత్రి నుండి నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకొని తెల్లవారుజామున కోన రఘుపతి పుటాహుటిగా పోలీస్ స్టేషన్ కి వచ్చారు. నాయకుల నిర్బంధన తీరును ఖండిస్తూ స్టేషన్లోనే కోన బైఠాయించి నిరసన తెలియజేశారు

ఈ సందర్భంగా బాపట్ల మాజీ ఎమ్మెల్యే, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు తనకు పోలీసులు నోటీసులు ఇవ్వలేదని గత రాత్రి మొదటిసారి తనకు నోటీసులు అందజేసారని తెలిపారు. పల్నాడు జిల్లాలో వైసీపీ క్యాడర్ బలంగా ఉందని.. జిల్లా ప్రజానీకం మొత్తం పిన్నెల్లి ఇంటి వద్ద కూర్చొని ఉంటారని, అలాంటి క్యాడర్ ఉన్న నాయకుడు కోసం ఇక్కడ నుంచి వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు. వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేసే పరిస్థితి పల్నాడు ప్రాంతంలో ఉంటుందని తెలిపారు. అంతటి ప్రజాదరణ కలిగిన నాయకులు పిన్నెల్లి సోదరులని ఈ సందర్భంగా తెలియజేశారు. నోటీసులు అందజేసి వెళ్లద్దంటే.. సరిపోతుంది. దానికి నిర్బంధించడమేమిటి అని పోలీసులు తీరును కోన రఘుపతి ఖండించారు. కోన రఘుపతి పోలీస్ స్టేషన్లో బైఠాయించిన విషయం కార్యకర్తలు తెలుసుకొని పెద్ద ఎత్తున బాపట్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

Leave a Reply