Collecttor | పోలింగ్ కేంద్రాల పరిశీలన..

Collecttor | పోలింగ్ కేంద్రాల పరిశీలన..

Collecttor, గద్వాల, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహణను జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. గురువారం ఉదయం ఐడిఓసి సమావేశపు మందిరంలో వెబ్ కాస్టింగ్ జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. గద్వాల, ధరూర్, గట్టు, కేటీ దొడ్డి మండలాల్లో పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది విధులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ఎన్నికల యంత్రాంగం పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మొదటి విడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో మొత్తం 106 గ్రామ పంచాయతీలలో 14 జీపీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 92 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ తో పాటు 839 వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా పోలింగ్ స్టేషన్లలో మొత్తం 839 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1077 మంది ఓపిఓలు విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

92 గ్రామపంచాయతీలలో మొత్తం 1,31,679 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇందులో 66,994 మంది మహిళలు, 64,684 మంది పురుషులు, ఒకరు ఇతరులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక స్టేజ్ 2 అధికారి పోలింగ్ సజావుగా జరిగేందుకు పర్యవేక్షణ చేస్తారన్నారు. జోనల్, స్థానిక మండల స్థాయి అధికారులు, పోలీస్ యంత్రాంగం, ఇతర సిబ్బంది పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించేందుకు విధులు నిర్వర్తిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జడ్పీ డిప్యూటీ సీఈవో నాగేంద్రం, డిపిఓ శ్రీకాంత్, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply